తెలంగాణలో ప్రాజెక్టులకు జలకళ
తెలంగాణలో ప్రాజెక్టులకు జలకళ
dam


హైదరాబాద్, 30 జూలై (హి.స.)గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తుండటంతో తెలంగాణలోని ప్రధాన ప్రాజెక్టులకు వరద ప్రవాహం పోటెత్తుతోంది.తీవ్ర వాయుగుండం ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలకు తోడు, మహారాష్ట్ర సహా ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని మేడిగడ్డ (లక్ష్మీ బ్యారేజీ) వద్ద నీటి ఉధృతి విపరీతంగా పెరిగింది. ప్రస్తుతం ఈ బ్యారేజీకి ఒక లక్షా వెయ్యి క్యూసెక్కులకు పైగా ఇన్-ఫ్లో వస్తుండటంతో, అధికారులు మొత్తం 85 గేట్లను ఎత్తివేసి వచ్చిన నీటిని వచ్చినట్లే దిగువకు విడుదల చేస్తున్నారు . కాళేశ్వరం వద్ద గోదావరి నీటిమట్టం వేగంగా పెరుగుతుండటంతో నదీ పరివాహక ప్రాంతాల ప్రజలను మరియు మత్స్యకారులను అధికారులు అప్రమత్తం చేశారు.మరోవైపు నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్టుకు సైతం వరద ఉధృతి ప్రమాదకరంగా మారుతోంది. ఈ జలాశయానికి ఉదయానికే 77 వేల క్యూసెక్కులకు పైగా భారీ ఇన్-ఫ్లో రాగా, నీటి మట్టాన్ని నియంత్రించేందుకు అధికారులు 6 వరద గేట్లను ఎత్తి 48 వేల క్యూసెక్కుల నీటిని కిందకు వదులుతున్నారు. అలాగే నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు సైతం ప్రవాహం క్రమంగా పుంజుకుంటూ ప్రస్తుతం 12,900 క్యూసెక్కుల ఇన్-ఫ్లో నమోదవుతోంది. దీంతో ప్రాజెక్టు ప్రస్తుత నీటి నిల్వ సామర్థ్యం 17 టీఎంసీలకు చేరుకుంది. ఎల్లంపల్లి ప్రాజెక్టుకు సైతం 75 వేల క్యూసెక్కుల వరద వస్తుండటంతో అధికారులు నంది పంప్‌హౌస్ ద్వారా మిడ్ మానేరుకు నీటిని ఎత్తిపోస్తున్నారు ఎగువ ప్రాంతాల్లో ఇంకా వర్షాలు కురుస్తున్నందున రాబోయే కొన్ని గంటల్లో ఈ వరద ఉధృతి మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande