
తిరుపతి, , 04 జూలై (హి.స.)
ఇటీవల కాలంలో ఆధ్యాత్మిక క్షేత్రం తిరుపతి పరిసర ప్రాంతాల్లో చిరుత పులుల సంచారం స్థానిక ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తోంది. తాజాగా.. రేణిగుంట మండలం వెంకటాపురం గ్రామంలో అర్ధరాత్రి వేళ ఓ చిరుతపులి జనావాసాల్లోకి రావడం స్థానికంగా కలకలం రేపింది. ఆహారం, నీటి అన్వేషణలో భాగంగా అడవి నుంచి బయటకు వచ్చిన ఆ చిరుత.. గ్రామంలోని ఓ ఇంట్లోకి చొరబడేందుకు ప్రయత్నించింది. చిరుతను గమనించిన ఇంటి కుటుంబ సభ్యులు.. గట్టిగా కేకలు వేయడం ప్రారంభించారు. దీంతో చిరుతపులి అక్కడి నుంచి పారిపోయింది. ఎట్టకేలకు చిరుత వెళ్లిపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
ఇదిలా ఉంటే.. చిరుతపులి సంచారానికి సంబంధించిన దృశ్యాలన్నీ ఆ ఇంటి ఆవరణలో ఉన్న సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. అర్ధరాత్రి వేళ చిరుత పిల్లిలా నక్కినక్కి రావడం, ఇంట్లోకి దూరాలని చూడటం ఆ ఫుటేజీలో కనిపించడంతో స్థానికులు భయబ్రాంతులకు గురవుతున్నారు. ఈ వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు గ్రామానికి చేరుకుని పరిశీలించారు. ప్రజలు రాత్రి వేళల్లో ఒంటరిగా తిరగవద్దని, అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. చిరుతను పట్టుకునేందుకు అవసరమైన చర్యలు చేపడుతున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ