
వేలేరుపాడు, 04 జూలై (హి.స.)
నివాస ప్రాంతాల్లోకి వచ్చి.. పశువులపై దాడి చేసి చంపేస్తూ ఇటు ప్రజలను, అటు అధికారులను ముప్పతిప్పలు పెడుతున్న పెద్దపులి.. రెండు రోజులుగా జాడ లేకుండా పోయింది. గతంలో ఒకసారి దాన్ని బంధించిన అటవీ సిబ్బంది దానికి రేడియో ట్రాకర్ అమర్చి అడవిలో వదిలిపెట్టగా... అది చివరకు ఏలూరు జిల్లా వేలేరుపాడు అటవీ ప్రాంతానికి చేరింది. బుధవారం ఉదయం 5.30 ప్రాంతంలో మండలంలోని చింతలపాడు వద్ద ఆవును చంపేసింది. అటవీ సిబ్బంది, రెస్క్యూ బృందాలు హుటాహుటిన అక్కడకు చేరుకుని.. రెడియో ట్రాకర్ సిగ్నల్స్ ద్వారా పులి జాడ కనిపెట్టారు. సమీప అడవిలోనే ఉన్న పులి మళ్లీ పశువులపై దాడి చేసే అవకాశం ఉండడంతో.. మృతిచెందిన ఆవు కళేబరాన్ని అడవికి తరలించి ఎరగా వేశారు. మరోసారి అదే ఆవు మాంసాన్ని తిన్న పెద్దపులి.. ఎడవల్లి, కటుకూరు గ్రామాల మధ్య ఉన్న అటవీ ప్రాంతం నుంచి గుట్టపైకి వెళ్లినట్టు రెడియో ట్రాకర్ సిగ్నల్స్ ద్వారా గుర్తించారు. బుధవారం రాత్రి వరకూ పులి ఎక్కడ ఉందో తెలిసినా.. గురువారం ఉదయం నుంచి సిగ్నల్స్ రావడంలేదు. దీంతో అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. డ్రోన్ కెమెరాల ద్వారా పులి జాడను గుర్తించేందుకు చేసిన ప్రయత్నాలు కూడా విఫలమయ్యాయి. అయితే, ఎరగా వేసిన ఆవు కళేబరాన్ని రెండోసారి కూడా పెద్దపులి తిని వెళ్లిపోయిందని, ఆ సమయంలో రెస్క్యూ బృం దాలు అక్కడ కాపు కాయలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ట్రాకర్ సిగ్నల్స్పైనే ఆధారపడుతూ దాన్ని బంధించే ప్రయత్నాలు చేయడం లేదని విమర్శిస్తున్నారు. కాగా... ఎప్పుడు, ఎటువైపు నుంచి వచ్చి పులి దాడి చేస్తుందోనని వేలేరుపాడు అటవీ ప్రాంతం చుట్టుపక్కల గ్రామాల ప్రజలు భయంతో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ