
చిత్తూరు,04 జూలై (హి.స.)
కుప్పం నుంచి మరోచోటికి వెళ్లే పరిస్థితులు రాకూడదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. కుప్పం చరిత్ర మార్చే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామన్నారు. అభివృద్ధి కార్యక్రమాలు స్వర్ణ కుప్పానికి నాంది పలుకుతాయని తెలిపారు. ఈరోజు(శనివారం) కుప్పం నియోజకవర్గంలో పర్యటించిన సీఎం.. అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు. రాయలసీమలో పెద్ద ఎత్తున ప్రాజెక్టులు వస్తున్నాయని.. ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడికి ఉద్యోగాల కోసం రావాలన్నారు. కుప్పం నియోజకవర్గంలో 80వేల మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నట్లు చెప్పారు. వందల మంది పౌల్ట్రీ రైతులకు చేయూతనిస్తామని వెల్లడించారు. అడిడాస్ పరిశ్రమతో 20వేల మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నట్లు చెప్పారు. డెయిరీ, ఫుడ్ ప్రాసెసింగ్, పౌల్ట్రీ పరిశ్రమలు వచ్చాయన్నారు. మైక్రో ఇరిగేషన్ ఏపీకి శ్రీరామ రక్ష అని పేర్కొన్నారు.
రాయలసీమలో రూ.లక్ష కోట్లతో హార్టికల్చర్ హబ్ను ఏర్పాటు చేయనున్నట్లు సీఎం తెలిపారు. హార్టికల్చర్ హబ్ కోసం ప్రైవేటు రంగం నుంచి రూ.60 వేల కోట్లు.. ప్రభుత్వం నుంచి రూ.40 వేల కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు చెప్పారు. హార్టికల్చర్ హబ్గా కుప్పం నియోజకవర్గం తయారుకావాలని ఆకాంక్షించారు. కుప్పంలో పూర్తిగా వాణిజ్య పంటలు చేపట్టాలని సూచించారు.
అన్ని మతాలను గౌరవించుకోవాలని సీఎం అన్నారు. ఇతర మతాల వారిపై దాడులు సరికాదన్నారు. వైసీపీ హయాంలో రాష్ట్రాన్ని దోచుకుతిన్నారని ఆరోపించారు. ఐదేళ్లలో రాష్ట్రాన్ని విధ్వంసం చేశారని మండిపడ్డారు. వైసీపీ హయాంలో కుప్పం నియోజకవర్గంపై కక్ష గట్టారన్నారు. హంద్రీనీవా నీళ్లు ఇచ్చేసినట్లు డ్రామాలు ఆడారని.. సెట్టింగ్లు వేసి నాటకాలు ఆడారంటూ సీఎం చంద్రబాబు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ