
అమరావతి, 15 ఆగస్టు (హి.స.)
హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బొప్పన వరాహ లక్ష్మీ నరసింహ చక్రవర్తికి హైకోర్టు ఘనంగా వీడ్కోలు పలికింది. జస్టిస్ బీవీఎల్ఎన్ చక్రవర్తి పదవీకాలం శుక్రవారంతో ముగియడంతో హైకోర్టులోని మొదటి కోర్టు హాలులో వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లిసా గిల్ మాట్లాడుతూ... ‘జస్టిస్ చక్రవర్తి 32 ఏళ్లకు పైగా న్యాయవ్యవస్థలో వివిధ హోదాల్లో విశిష్ఠ సేవలందించారు. సహజ న్యాయసూత్రాలకు భంగం కలగకుండా విచారణ ప్రక్రియ వేగంగా పూర్తి చేసేవారు. న్యాయవ్యవస్థకు ఆయన అందించిన సేవలు ఎప్పటికీ నిలిచిపోతాయి. ఆయన శేష జీవితం ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’ అని అన్నారు.
న్యాయాధికారిగా, న్యాయమూర్తిగా 32 ఏళ్ల సర్వీస్ తనకు సంతృప్తినిచ్చిందని జస్టిస్ చక్రవర్తి అన్నారు. పదవీ విరమణ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తన ప్రస్థానాన్ని సుధీర్ఘ క్రికెట్ ఇన్నింగ్స్తో పోల్చారు. పదవీ విరమణను ఓటమిగా భావించడం లేదని.. మైదానంలో అత్యుత్తమ ప్రదర్శనతో నాటౌట్గా నిలిచి తర్వాతి తరానికి బ్యాటింగ్ అప్పగిస్తున్నట్లు భావిస్తున్నానని తెలిపారు. రిజిస్ట్రార్ ఐటీగా, కంప్యూటర్ కమిటీ సభ్యునిగా, మాస్టర్ ట్రైనీగా పనిచేయడం మరిచిపోలేని అనుభవమన్నారు. ప్రజలు, సహచరులకు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ