తిరుమలలో పోటెత్తిన భక్తులు.. కిటకిటలాడుతున్న క్యూ కాంప్లెక్స్లు
తిరుమలలో పోటెత్తిన భక్తులు.. కిటకిటలాడుతున్న క్యూ కాంప్లెక్స్లు
తిరుమల


తిరుమల, 15 ఆగస్టు (హి.స.)స్వాతంత్ర్య దినోత్సవం, వారాంతపు సెలవుల నేపథ్యంలో కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి దర్శనార్థం భక్తులు భారీగా పోటెత్తారు. దీంతో తిరుమలలో భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని అన్ని కంపార్ట్మెంట్లు భక్తులతో పూర్తిగా నిండిపోయాయి. ఉచిత సర్వదర్శనం కోసం వేచి ఉండే భక్తుల క్యూలైన్ బయటకు వచ్చి శిలాతోరణం వరకు విస్తరించింది. ఉదయం 8 గంటల తర్వాత క్యూలైన్లలోకి ప్రవేశించే భక్తులకు శ్రీవారి సర్వదర్శనం లభించడానికి సుమారు 18 గంటల సమయం పడుతుందని అధికారులు వెల్లడించారు. భక్తుల రద్దీ దృష్ట్యా తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అధికారులు ఎప్పటికప్పుడు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.

మరోవైపు ప్రత్యేక ప్రవేశ దర్శనం (రూ. 300 టికెట్లు) కలిగిన భక్తులకు దాదాపు 3 నుంచి 5 గంటలు, సర్వదర్శనం టైమ్ స్లాట్ (SSD) టోకెన్లు కలిగిన భక్తులకు 5 నుంచి 7 గంటల సమయం పడుతోందని టీటీడీ అధికారులు తెలిపారు. సెలవుల రద్దీ దృష్ట్యా క్యూలైన్ల కదలిక, పరిస్థితులను బట్టి దర్శన సమయాల్లో మార్పులు ఉండవచ్చని టీటీడీ స్పష్టం చేసింది. భక్తులు తమ ప్రయాణాలను ముందుగానే తగిన విధంగా ప్లాన్ చేసుకోవాలని సూచించింది. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులతో వచ్చే భక్తులు ఎక్కువ సమయం క్యూలైన్లలో వేచి ఉండేందుకు సిద్ధపడి రావాలని, అవసరమైన అత్యవసర మందులు, మంచినీరు వెంట ఉంచుకోవాలని దేవస్థానం అధికారులు విజ్ఞప్తి చేశారు. భక్తుల తాజా వివరాల కోసం TTD Official Website నిబంధనలను పాటించాలని సూచించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande