
హైదరాబాద్, 16 ఆగస్టు (హి.స.) తెలంగాణ రాష్ట్రంలో కొత్త సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు ములుగు పర్యటన ద్వారా శ్రీకారం చుట్టారు.
కొత్త పింఛన్ల పంపిణీ:
రాష్ట్రంలోని అర్హులైన వితంతువులు, ఒంటరి మహిళలకు నూతనంగా ఆసరా పింఛన్లు అందించే ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని మేడారం పవిత్ర పుణ్యక్షేత్రం నుంచే సీఎం లాంఛనంగా ప్రారంభించారు. గ్రామీణాభివృద్ధి సంస్థ (సెర్ప్) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ ప్రత్యేక కార్యక్రమంలో అర్హులైన 24 మంది వితంతువులు, ఒంటరి మహిళలకు రూ.2,016/-చొప్పున ఆసరా చేయూత పింఛను ఆర్థిక సహాయానికి సంబంధించిన చెక్కులను ముఖ్యమంత్రి స్వయంగా లబ్ధిదారులకు అందజేశారు.
పర్యావరణ పరిరక్షణ పిలుపు & వాటర్ ప్లాంట్ ప్రారంభం:
ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో పర్యావరణ స్పృహను పెంపొందించేలా ముఖ్యమంత్రి ఒక మొక్కను నాటారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..
పర్యావరణ పరిరక్షణ అనేది మనందరి సామాజిక బాధ్యత. భావి తరాల భవిష్యత్తు కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని కాపాడుకోవాలి అని పిలుపునిచ్చారు. అలాగే, మేడారానికి వచ్చే వేలాది మంది భక్తులు, యాత్రికుల దాహార్తి తీర్చేందుకు ఆలయ ప్రాంగణంలో నూతనంగా ఏర్పాటు చేసిన శుద్ధి చేసిన తాగునీటి (వాటర్) ప్లాంట్ను సీఎం ప్రారంభించి జాతికి అంకితం చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..