
హైదరాబాద్, 18 ఆగస్టు (హి.స.)
రేవంత్ రెడ్డి తీరు పిచ్చోడి చేతిలో రాయిలా మారిందని సమస్యలను పరిష్కరించాల్సిన ప్రభుత్వం.. కొత్త సమస్యలను సృష్టిస్తోందని మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శించారు. రాత్రికి రాత్రే కాలనీలకు కాలనీలను 22A నిషేధిత జాబితాలో చేరిస్తే ప్రజలు ఎక్కడికి పోవాలి? ప్రభుత్వం చేసిన తప్పులకు ప్రజలు అధికారుల చుట్టూ చెప్పులు అరిగేలా తిరగాలా? అని ప్రశ్నించారు. నిషేధిత భూముల తప్పిదంలో నైతిక బాధ్యత వహించి మంత్రి పదవికి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి, మంత్రులు కలిసి చేసిన తప్పును అధికారుల మీదకు నెట్టడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 22A నిషేధిత భూముల జాబితాను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఇవాళ మల్కాజ్గిరిలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో హరీశ్ రావు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.
రాష్ట్రవ్యాప్తంగా జరిగిన ఈ వ్యవహారానికి బాధ్యత వహిస్తూ రేవంత్ రెడ్డి వెంటనే సంబంధిత మంత్రిని పదవి నుంచి తొలగించాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు. మంత్రి చేసిన తప్పులకు సీఎం చర్యలు తీసుకోకపోతే.. ఇద్దరూ కలిసి కుట్రపూరితంగా ఈ భూదందా చేశారనే అనుమానాలు ప్రజల్లో మరింత బలపడతాయని అన్నారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తన తప్పు ఏమీ లేనట్లుగా అధికారులపై నెపం నెట్టడం సరికాదన్నారు. పెద్ద తప్పు చేసి ఇప్పుడు సారీ చెబుతున్నారు. సారీ చెబితే ప్రజల బాధలు తీరుతాయా? అసలు జాబితాలో భూములను చేర్చింది ఎవరు? చేర్చమని ఆదేశించింది ఎవరు? ఇష్టానుసారంగా జాబితాలో పెడతారా? అధికారుల పేర్లు చెప్పి తప్పించుకుంటారా? అని నిలదీశారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన టోల్ నంబర్ కూడా సక్రమంగా పనిచేయడం లేదని ఇది ఎంత దగా ప్రభుత్వం? అని ప్రశ్నించారు.
నిషేధిత జాబితాలో పెట్టింది మీరే కాబట్టి.. తీసేయాల్సింది కూడా మీరేనని ఎట్లా పెట్టారో.. అట్లాగే తొలగించాలన్నారు. ప్రజల నుంచి దరఖాస్తులు తీసుకోకుండా, వారిని కార్యాలయాల చుట్టూ తిప్పకుండా నిషేధిత జాబితా నుంచి భూములను తొలగించాలని డిమాండ్ చేశారు. 2008లో ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ULCని రద్దు చేసిందని, ఆ తర్వాత ఆ భూములు పట్టా భూములుగా మారి, ఏళ్లుగా ప్రజలు అక్కడ నివసిస్తున్నారని తెలిపారు. 20 ఏళ్లుగా లేని సమస్యను ఇప్పుడు ఎందుకు సృష్టించారని ప్రశ్నించారు. రంగారెడ్డిలో 7,500 జీఓల ద్వారా మినహాయింపు పొందిన భూములు, మేడ్చల్లో 6,000కు పైగా భూములు, HMDA, HUDA భూములను కూడా నిషేధిత జాబితాలో చేర్చారని ఆరోపించారు. రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలపై పట్టు సాధించేందుకే నిషేధిత భూముల పేరుతో ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని విమర్శించారు. వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని తప్పు చేసిన ఈ కాంగ్రెస్ నాయకులను చట్టపరంగా బాధ్యులను చేస్తామన్నారు. 22A నిషేధిత భూముల విషయంలో అసెంబ్లీ వేదికగా బీఆర్ఎస్ పోరాటం చేస్తుందని కేసీఆర్ నాయకత్వంలో మేమంతా ప్రజలకు అండగా ఉంటామన్నారు. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల విషయంలో కూడా ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని హరీశ్ రావు ఆరోపించారు. కోర్టులో కౌంటర్ కూడా దాఖలు చేయకుండా కావాలనే నిర్లక్ష్యం వహించారని విమర్శించారు. కేసీఆర్ హయాంలో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ కోసం రూ.2,600 కోట్లు కేటాయిస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం రూ.800 కోట్లు మాత్రమే కేటాయించిందన్నారు. కల్యాణలక్ష్మి ఇప్పుడు సంతానలక్ష్మిగా మారింది. పెళ్లి సమయంలో అందాల్సిన సాయం పిల్లలు పుట్టిన తర్వాత వస్తోంది. కల్యాణలక్ష్మి విషయంలో పొన్నం ప్రభాకర్ అధికారుల తప్పు అంటున్నారు. నిషేధిత భూముల విషయంలో పొంగులేటి కూడా అధికారుల తప్పు అంటున్నారు. తప్పు మీది.. అధికారులది కాదు. తప్పు మీరు చేస్తారు.. దరఖాస్తులు మాత్రం ప్రజలు పెట్టుకోవాలా? అని హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..