
విశాఖపట్నం 18 ఆగస్టు (హి.స.)
,నగరంలోని షీలా నగర్లో రెండు మృతదేహాలు లభ్యమవడం తీవ్ర కలకలం రేపుతోంది. షీలానగర్ జంక్షన్ వద్ద నిర్మాణంలో ఉన్న షీలానగర్-సబ్బవరం పోర్టు కనెక్టివిటీ రోడ్డు పనుల్లో భాగంగా రెండు గుర్తుతెలియని డెడ్బాడీస్ లభించాయి. ఈరోజు(మంగళవారం) డంపర్ లారీలు మట్టి వేస్తుండగా కుప్పలో 2 శవాలు కనిపించాయి. దీంతో సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం అందించగా.. వారు అక్కడకు చేరుకుని ఘటనా స్థలిని పరిశీలించారు. ఒకటి మహిళ మృతదేహం కాగా మరొకటి పురుషుడి మృతదేహంగా గుర్తించారు.
రెండు మృతదేహాలూ పూర్తిగా డికంపోజ్ అయినట్లు తెలిపారు. అంతేకాకుండా.. మట్టిలో పాత తలగడలు, బొంతలు, పూలమాలలు, చెక్కలు లభ్యమయ్యాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రోడ్డు పనుల్లో భాగంగా ఉపయోగించిన మట్టి.. శ్మశానం నుంచి తీసుకొచ్చినట్లుగా అనుమానిస్తున్నామని ఏసీపీ శ్రీనివాసరావు తెలిపారు
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ