
ఖమ్మం, 18 ఆగస్టు (హి.స.)
చదువును ఆయుధంగా చేసుకుంటే
పేదరికాన్ని జయించి ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని ఖమ్మం జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ అన్నారు. ప్రతి విద్యార్థి ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుని దానిని సాధించే దిశగా కష్టపడి చదవాలని సూచించారు. విద్యార్థుల భవిష్యత్తుకు నాణ్యమైన విద్యతో పాటు క్రమశిక్షణ, ఆరోగ్యం, భద్రత, మెరుగైన వసతులు అత్యంత కీలకమని స్పష్టం చేశారు. కారేపల్లి మండలం రేలకాయలపల్లిలోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలను మంగళవారం కలెక్టర్ దివాకర టీఎస్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా పాఠశాలకు చేరుకున్న ఆయన తరగతి గదులు, విద్యాబోధన, వసతులు, విద్యార్థుల సంక్షేమం, వంటశాల, భోజన నాణ్యత తదితర అంశాలను క్షుణ్ణంగా పరిశీలించారు. విద్యార్థులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలు, పాఠశాలలో అందుతున్న సౌకర్యాలపై ఆరా తీశారు.
విద్యార్థుల చదువు, భోజనం, వసతులు ఎలా ఉన్నాయని కలెక్టర్ స్వయంగా అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలో అందుతున్న భోజనం, మెనూ అమలు, తాగునీరు, పరిసరాల పరిశుభ్రత తదితర అంశాలపై వివరాలు తెలుసుకున్నారు. విద్యార్థులు తమకు అందుతున్న సౌకర్యాలపై కలెక్టర్కు వివరించారు.
చదువుతో పాటు క్రమశిక్షణ, బాధ్యత, వ్యక్తిత్వ వికాసానికి ఉపాధ్యాయులు ప్రాధాన్యం ఇవ్వాలని కలెక్టర్ సూచించారు. ప్రతి విద్యార్థిలో దాగి ఉన్న ప్రతిభను గుర్తించి, వారి లక్ష్యాలను చేరుకునేలా ఉపాధ్యాయులు నిరంతరం మార్గనిర్దేశం చేయాలని ఆదేశించారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని పాఠశాలలో మెరుగైన విద్యా వాతావరణం కల్పించాలన్నారు.
పాఠశాల వంటశాలను పరిశీలించిన కలెక్టర్ వంటగది పరిశుభ్రత, ఆహార పదార్థాల నాణ్యతను స్వయంగా పరిశీలించారు. ప్రభుత్వం నిర్ణయించిన మెనూ ప్రకారం విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలని స్పష్టం చేశారు. విద్యార్థులకు మంచి చదువుతో పాటు ఆరోగ్యకరమైన ఆహారం అందించడం కూడా అధికారుల బాధ్యతేనని అన్నారు. మెనూ అమలులో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..