పాపన్న గౌడ్ పోరాట స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకోవాలి.. కడియం శ్రీహరి
పాపన్న గౌడ్ పోరాట స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకోవాలి.. కడియం శ్రీహరి
Mla


జనగామ, 18 ఆగస్టు (హి.స.)

సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ పోరాట స్ఫూర్తిని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 376వ జయంతి సందర్భంగా చిలుపూర్ మండలం చిన్నపెండ్యాల గ్రామంలోని పాపన్న విగ్రహానికి మంగళవారం ఎమ్మెల్యే కడియం శ్రీహరి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బహుజన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ పోరాట స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకుని ప్రతి ఒక్కరూ ఆయన అడుగుజాడల్లో నడవాలని అన్నారు.

పేద, బడుగు, బలహీన వర్గాల సమానత్వం కోసం పోరాడిన గొప్ప వ్యక్తి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని పేర్కొన్నారు. బడుగులను ఐక్యం చేసి, ప్రత్యేక సైన్యాన్ని ఏర్పాటు చేసుకుని గోల్కొండ కోటను జయించిన సర్దార్ పాపన్నను నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. దొరలు, పెత్తందార్ల ఆధిపత్యానికి, అణచివేతకు ఎదురొడ్డి పోరాడిన వీరుడని కొనియాడారు. బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి నిత్యం పరితపించిన యోధుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ చరిత్రను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని అన్నారు.

సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని శ్రీహరి పిలుపునిచ్చారు. గీత కార్మికుల సమస్యల పరిష్కారానికి ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande