విద్యార్థినుల పై అసభ్య ప్రవర్తన.. లెక్చరర్కు దేహశుద్ధి !
విద్యార్థినుల పై అసభ్య ప్రవర్తన.. లెక్చరర్కు దేహశుద్ధి !
లెక్చరర్


నల్గొండ, 18 ఆగస్టు (హి.స.)

నల్గొండ జిల్లా దేవరకొండ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో తీవ్ర కలకలం రేగింది. విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడనే ఆరోపణలతో కాలేజీకి చెందిన తెలుగు లెక్చరర్ భాస్కర్కు విద్యార్థినులు దేహశుద్ధి చేశారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది. ఘటన వివరాల్లోకి వెళ్తే స్థానిక ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో భాస్కర్ అనే వ్యక్తి తెలుగు లెక్చరర్గా పని చేస్తున్నాడు. అయితే, గత కొంతకాలంగా ఇతడు కళాశాలకు వచ్చే విద్యార్థినుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. మంగళవారం నాడు విద్యార్థినులతో దారుణంగా ప్రవర్తించడంతో బాలికల సహనం నశించింది. ఆగ్రహానికి గురైన విద్యార్థినులు లెక్చరర్ భాస్కర్ను కళాశాల ప్రాంగణంలోనే నిలదీసి, చేతులతో చితక్కొట్టారు.

ప్రిన్సిపాల్, లెక్చరర్ను సస్పెండ్ చేయాలని ఏబీవీపీ ధర్నా..

ఈ విషయం తెలుసుకున్న ఏబీవీపీ (ABVP) విద్యార్థి సంఘం నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున కళాశాల ముందుకు చేరుకున్నారు. విద్యార్థినులకు రక్షణ కల్పించడంలో, లెక్చరర్ వేధింపులపై ఫిర్యాదు చేసినా పట్టించుకోని ప్రిన్సిపాల్పై వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యతారహితంగా ప్రవర్తించిన ప్రిన్సిపాల్తో పాటు, విద్యార్థినులను వేధించిన తెలుగు లెక్చరర్ భాస్కర్ను తక్షణమే ఉద్యోగం నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థులు కళాశాల ముందు బైఠాయించి భారీ ధర్నా నిర్వహించారు. సమాచారం అందుకున్న దేవరకొండ పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ధర్నా చేస్తున్న విద్యార్థులతో మాట్లాడి శాంతింపజేసే ప్రయత్నం చేశారు. విద్యార్థినులు ప్రిన్సిపాల్, లెక్చరర్ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ బైఠాయించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande