ఎమ్మెల్యేలకు కొత్త కార్లు, నెలకు లక్ష రూపాయల అలవెన్స్! తమిళనాడు సీఎం బంపర్ ఆఫర్
ఎమ్మెల్యేలకు కొత్త కార్లు, నెలకు లక్ష రూపాయల అలవెన్స్! తమిళనాడు సీఎం బంపర్ ఆఫర్
Tamilnadu CM


తమిళనాడు, 19 ఆగస్టు (హి.స.)

అధికారంలోకి వచ్చిన నాటి నుంచి తనదైన నిర్ణయాలతో అందరినీ ఆశ్చర్యపరుస్తున్న తమిళనాడు సీఎం విజయ్ మరోసారి సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలోని ప్రతి ఎమ్మెల్యేకు ఒక అధికారిక వాహనం కింద కొత్త కారుతో పాటు ఇంధనం, డ్రైవర్ కోసం అలవెన్స్ కింద రూ. 75 వేలు, అదనంగా, కార్యదర్శి ఖర్చులకు రూ.25,000 గ్రాంట్ అందించబోతున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ఇవాళ అసెంబ్లీ వేదికగా ఆయన పలు కీలక ప్రకటనలు చేశారు. రాష్ట్రంలోని మొత్తం 234 మంది శాసనసభ్యులకు ప్రభుత్వం తరఫున వీటిని అందించనున్నట్లు వెల్లడించారు. అలాగే ఎమ్మెల్యేలకు ఆరోగ్య బీమా కింద ఇచ్చే వార్షిక కవరేజీని రూ.5 లక్షల నుంచి రూ.25 లక్షలకు పెంచుతున్నట్లు ప్రకటించారు. ఆదాయంతో సంబంధం లేకుండా నాణ్యమైన వైద్య సేవలు అందాలన్నదే లక్ష్యమన్నారు. ఈ సందర్భంగా పాడి రైతులకు సైతం శుభవార్త చెప్పారు. పాలసేకరణ ధరను లీటరుకు రూ.38 నుంచి రూ.41 కు పెంచుతున్నట్లు వెల్లడించారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా పాడి రైతుల శ్రేయస్సుకు కృషి చేస్తున్నామని సీఎం వెల్లడించారు.

శాసనసభలో సీఎం విజయ్ మాట్లాడుతూ ప్రజాప్రతినిధులు ఇతరులపై ఆధారపకూడదని, ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండటానికి తరచూ పర్యటించాల్సి ఉంటుంది. ప్రస్తుతం శాసనసభలో ఉన్న చాలామంది సభ్యులు మొదటిసారి గెలిచినవారే కాకుండా సాధారణ, పేద నేపథ్యాల నుంచి వచ్చినవారు. వీరికి కావాల్సిన రవాణా సదుపాయాలను సమకూర్చడం ద్వారా పారదర్శకమైన, అవినీతి రహిత పాలనను అందించవచ్చు అని పేర్కొన్నారు. తమకు రవాణా సదుపాయాలు కల్పించాలని వీసీకే ఎమ్మెల్యే జ్యోతిమణి విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

ఎమ్మెల్యేలకు నూతన వాహనాల విషయంలో సీఎం చేసిన ప్రకటనపై మిత్రపక్షాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ఈ నిర్ణయం వల్ల ఎమ్మెల్యేల పనితీరు మెరుగుపడటమే కాకుండా, రాష్ట్రంలో డ్రైవర్లు, ప్రైవేట్ సెక్రటరీలుగా పలువురికి కొత్త ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెబుతుండగా... ప్రధాన ప్రతిపక్షం డీఎంకే (DMK) మాత్రం ఈ నిర్ణయంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. డీఎంకె అధికార ప్రతినిధి ఎ.శరవణన్ మాట్లాడుతూ.. అన్ని నియోజకవర్గాల ఎమ్మెల్యేలకు వాహనాలు, నెలకు వేలల్లో అలవెన్సులు ఇవ్వడం వల్ల రాష్ట్ర ఖజానాపై తీవ్రమైన ఆర్థిక భారం పడుతుంది. అసలు ఈ సమయంలో ఇటువంటి అనవసరపు ఖర్చుల ప్రకటన అవసరమా? అని ప్రశ్నించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande