కడెం అడవుల్లో తప్పిపోయిన 70 ఏళ్ల వృద్ధుడు చెరువులో శవమై లభ్యం
కడెం అడవుల్లో తప్పిపోయిన 70 ఏళ్ల వృద్ధుడు చెరువులో శవమై లభ్యం
కడెం అడవుల్లో తప్పిపోయిన 70 ఏళ్ల వృద్ధుడు చెరువులో శవమై లభ్యం


నిర్మల్: , 22 ఆగస్టు (హి.స.)

నిర్మల్ జిల్లా కడెం మండలం నవాపేట గ్రామానికి చెందిన సిద్ధం గంగన్న (70) అనే వృద్ధుడి అదృశ్యం ఉదంతం చివరకు విషాదాంతమైంది. గత జూలై 30వ తేదీన పశువుల కాపలా కోసం గ్రామ శివార్లలోని అటవీ ప్రాంతానికి వెళ్లిన గంగన్న రాత్రి అయినా ఇంటికి తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలించినా ఆచూకీ లభించకపోవడంతో కడెం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి, అటవీ సిబ్బందితో కలిసి మూడు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి అడవుల్లో విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు.

అయితే, దాదాపు మూడు వారాల తర్వాత అంబారిపేట గ్రామ శివార్లలో ఉన్న ఒక స్థానిక చెరువులో ఒక వృద్ధుడి మృతదేహం తేలియాడుతూ ఉండటాన్ని రోజువారీ కూలీలు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మరియు కుటుంబ సభ్యులు, ఆ మృతదేహం తప్పిపోయిన సిద్ధం గంగన్నదేనని బట్టలు, ఇతర గుర్తుల ఆధారంగా నిర్ధారించారు. పశువులను కాసే క్రమంలో ప్రమాదవశాత్తు చెరువులో పడి మునిగిపోయి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆసుపత్రికి తరలించి, తదుపరి దర్యాప్తు జరుపుతున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande