విశాఖ వేదికగా బ్రిక్స్ దేశాల సదస్సు.. తోట్లకొండను సందర్శించిన బ్రిక్స్ ప్రతినిధులు
విశాఖ వేదికగా బ్రిక్స్ దేశాల సదస్సు.. తోట్లకొండను సందర్శించిన బ్రిక్స్ ప్రతినిధులు
brics


విశాఖపట్నం, 22 ఆగస్టు (హి.స.)

భారత్ అధ్యక్షతన జరుగుతున్న 2026 బ్రిక్స్ సదస్సులో భాగంగా సాగర నగరం విశాఖపట్నం కీలక సమావేశాలకు ఆతిథ్యం ఇస్తోంది. ఇవాళ‌, రేపు తేదీల్లో బ్రిక్స్ యువజన వ్యవహారాల మంత్రుల సమావేశం, క్రీడా మంత్రుల సమావేశం ఇక్కడ జరుగుతున్నాయి. బ్రెజిల్, చైనా, ఈజిప్ట్, ఇథియోపియా, భారత్, ఇండోనేషియా, ఇరాన్, రష్యా, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, యూఏఈ సహా 11 సభ్య దేశాల మంత్రులు, ఉన్నత స్థాయి ప్రతినిధులు ఈ సమావేశాల్లో పాల్గొంటున్నారు.

కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవియా ఈ రెండు సమావేశాలకు అధ్యక్షత వహిస్తున్నారు. సమావేశాలు ప్రారంభం కావడానికి ముందు, ఇవాళ‌ ఉదయం బ్రిక్స్ దేశాల ప్రతినిధులు నగరంలోని ప్రఖ్యాత బౌద్ధ వారసత్వ ప్రదేశమైన తోట్లకొండను సందర్శించారు. బంగాళాఖాతానికి అభిముఖంగా ఉన్న ఈ ప్రాంతం ఆంధ్రప్రదేశ్‌కు ఉన్న గొప్ప సాంస్కృతిక, చారిత్రక వారసత్వాన్ని వారికి పరిచయం చేసింది. ఈ సందర్భంగా ప్రతినిధులు అక్కడ మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు.

'స్థిరత్వం, ఆవిష్కరణ, సహకారం, సుస్థిరత కోసం నిర్మాణం' అనే నినాదంతో ఈ ఏడాది భారత్ బ్రిక్స్ అధ్యక్ష బాధ్యతలు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా ఇవాళ‌ జరిగిన యువజన మంత్రుల సమావేశంలో యువత అభివృద్ధి, సాధికారతపై ప్రధానంగా దృష్టి సారించారు. విద్య, నైపుణ్యాభివృద్ధి, వ్యవస్థాపకత, శ్రేయస్సు, సుస్థిర అభివృద్ధి వంటి అంశాలపై చర్చించారు. ఈ భేటీలో బ్రిక్స్ యూత్ మినిస్టీరియల్ జాయింట్ డిక్లరేషన్‌తో పాటు, బ్రిక్స్ యూత్ కోఆపరేషన్ ఫ్రేమ్‌వర్క్‌ను ఆమోదించనున్నారు.

రేపు జరగనున్న క్రీడా మంత్రుల సమావేశంలో క్రీడల్లో పరస్పర సహకారాన్ని పునరుద్ఘాటించనున్నారు. ముఖ్యంగా సంప్రదాయ, దేశీయ క్రీడలు, క్రీడా సాంకేతికత, క్రీడా పరికరాల తయారీ, ఆవిష్కరణలు వంటి అంశాలపై చర్చించనున్నారు. ఈ సమావేశం చివరిలో బ్రిక్స్ క్రీడా ఉమ్మడి ప్రకటనను ఆమోదించే అవకాశం ఉంది.

ఈ రెండు రోజుల కార్యక్రమంలో భాగంగా ప్రతినిధులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో సమావేశం కానున్నారు. అలాగే, ద్వైపాక్షిక చర్చలు, బీచ్ రోడ్‌లో బ్రిక్స్ ఫ్రెండ్‌షిప్ సైక్లింగ్ ఈవెంట్, ఆంధ్రప్రదేశ్ సంప్రదాయాలను ప్రతిబింబించే సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహించనున్నారు. కేంద్ర సహాయ మంత్రి రక్షా ఖడ్సే, కార్యదర్శులు సునీల్ పలివాల్, హరి రంజన్ రావు ఈ కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande