జపాన్ను కుదిపేసిన భారీ భూకంపం.. 23 మందికి గాయాలు, నిలిచిన విద్యుత్ సరఫరా!
జపాన్లో ఆదివారం (ఆగస్టు 23) తెల్లవారుజామున సంభవించిన భారీ భూకంపం తీవ్ర భయాందోళనలకు గురిచేసింది. స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 2 గంటల సమయంలో దక్షిణ ఇబరాకి ప్రిఫెక్చర్ను కేంద్రంగా చేసుకుని భూకంపం సంభవించింది. జపాన్ వాతావరణ సంస్థ ప్రకారం భూకంప తీవ్రత 5.9
Earthquakes


జపాన్, 23 ఆగస్టు (హి.స.)జపాన్లో ఆదివారం (ఆగస్టు 23) తెల్లవారుజామున సంభవించిన భారీ భూకంపం తీవ్ర భయాందోళనలకు గురిచేసింది. స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 2 గంటల సమయంలో దక్షిణ ఇబరాకి ప్రిఫెక్చర్ను కేంద్రంగా చేసుకుని భూకంపం సంభవించింది. జపాన్ వాతావరణ సంస్థ ప్రకారం భూకంప తీవ్రత 5.9గా నమోదైంది. భూకంప కేంద్రం భూమికి సుమారు 68 నుంచి 70 కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఇబరాకి, సైతామా, చిబా, టోక్యో సహా పలు ప్రాంతాల్లో గరిష్ఠంగా 5 లోయర్ తీవ్రత నమోదైంది.

భూకంపం కారణంగా ఇప్పటివరకు 23 మంది గాయపడినట్లు అధికారులు తెలిపారు. వారిలో ఎక్కువ మందికి స్వల్ప గాయాలయ్యాయి. నిద్రిస్తున్న సమయంలో ఒక్కసారిగా ప్రకంపనలు రావడంతో కొందరు కిందపడగా, మరికొందరు ఫర్నిచర్, తలుపులను ఢీకొని గాయపడ్డారు. యోకోహామాలో 80 ఏళ్లకు పైబడిన ఓ మహిళ మంచం నుంచి కిందపడటంతో తుంటికి తీవ్ర గాయమైనట్లు సమాచారం. గాయపడిన వారి సంఖ్య మరింత పెరిగే అవకాశముందని అధికారులు తెలిపారు.

భూకంపం ప్రభావంతో టోక్యోలోని కోటో ప్రాంతంలో భూగర్భ నీటి పైపులైన్ దెబ్బతినడంతో నీరు రోడ్డుపైకి వచ్చింది. కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. టోక్యో-నరిటా మధ్య నడిచే ఎక్స్ప్రెస్ రైళ్లు ఆలస్యమయ్యాయి. అయితే షింకన్సెన్ బుల్లెట్ రైళ్ల సేవలకు పెద్దగా అంతరాయం కలగలేదు.

ఈ భూకంపం వల్ల ఎలాంటి సునామీ ముప్పు లేదని అధికారులు స్పష్టం చేశారు. అణు విద్యుత్ కేంద్రాల్లోనూ ఎలాంటి అసాధారణ పరిస్థితులు నమోదు కాలేదని వెల్లడించారు. భూకంప పరిస్థితిని పర్యవేక్షించేందుకు ప్రభుత్వం అత్యవసర కార్యాచరణ బృందాన్ని ఏర్పాటు చేసింది. మొబైల్ ఫోన్లకు కూడా అత్యవసర హెచ్చరికలు జారీ అయ్యాయి.

ఇక భూకంపం అనంతరం మరో వారం రోజుల పాటు ఇదే స్థాయి ప్రకంపనలు సంభవించే అవకాశం ఉందని జపాన్ వాతావరణ సంస్థ ప్రజలను అప్రమత్తం చేసింది. గత నెలలో కుమామోటో ప్రాంతంలో 7.1 తీవ్రతతో భూకంపం సంభవించిన నేపథ్యంలో తాజా ప్రకంపనలు జపాన్ ప్రజల్లో మరోసారి ఆందోళన కలిగించాయి. అధికారులు సహాయక చర్యలు, నష్టాల అంచనాను కొనసాగిస్తున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande