
హైదరాబాద్, 14 ఆగస్టు (హి.స.)
దిశ, వెబ్స్టెస్క్: అగ్రరాజ్యం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్
డ్రోన్ల తయారీ, విక్రయాల రంగంలో చైనా ఆధిపత్యానికి చెక్ పెట్టేందుకు ఎవరూ ఊహించని నిర్ణయం తీసుకున్నారు. విదేశాల నుంచి అమెరికాలోకి దిగుమతి అయ్యే డ్రోన్లు, వాటి భాగాలపై ఏకంగా 100 శాతం వరకు టారిఫ్లు విధిస్తున్నట్లుగా ఇవాళ ప్రకటించారు. జాతీయ భద్రత, స్వదేశీ తయారీ రంగాన్ని ప్రోత్సహించడమే లక్ష్యంగా ఈ చర్యలు తీసుకున్నట్లుగా వైట్ హౌస్ వర్గాలు స్పష్టం చేశాయి.
ఏ డ్రోన్లపై ఎంత పన్ను అంటే..
వైట్హౌస్ అధికారుల సమాచారం మేరకు 25 కేజీల కంటే ఎక్కువ బరువు ఉండి, థర్మల్ ఇమేజర్లు, డాకింగ్ స్టేషన్లు వంటి జాతీయ భద్రతకు సంబంధించిన సామర్థ్యాలు ఉన్న అన్మ్యాన్డ్ ఏరియల్ సిస్టమ్స్ డ్రోన్ల దిగుమతిపై 100 శాతం పన్ను వర్తించనుంది. ఇక చిన్న తరహా డ్రోన్లపై 25 శాతం సుంకాన్ని విధించనున్నారు. ఈ కొత్త పన్ను నిబంధనలు సెప్టెంబర్ 3 నుంచి అమలుల్లోకి రానున్నాయి. అయితే, ప్రస్తుతం ప్రపంచ డ్రోన్ల మార్కెట్లో చైనాకు చెందిన 'DJI' కంపెనీ దాదాపు మూడింట రెండు వంతుల మార్కెట్ను కలిగి ఉంది. అమెరికా విదేశీ డ్రోన్లపై పూర్తిగా ఆధారపడటాన్ని తగ్గించి, స్థానికంగా డ్రోన్ల ఉత్పత్తిని, సరఫరా వ్యవస్థను పెంపొందించడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..