
హైదరాబాద్, 24 ఆగస్టు (హి.స.) మాస్ మహారాజా రవితేజ నటించిన తాజా చిత్రం 'ఇరుముడి' బాక్సాఫీస్ వద్ద సంచలన ప్రదర్శన కొనసాగిస్తోంది. దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కించిన ఈ ఎమోషనల్ డ్రామాకు ప్రేక్షకుల నుంచి వస్తున్న పాజిటివ్ టాక్ రోజురోజుకూ మరింత పెరుగుతోంది.
ముఖ్యంగా సినిమాలోని బలమైన కథ, భావోద్వేగభరితమైన సన్నివేశాలు ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతున్నాయని తెలుస్తోంది. దీంతో వీకెండ్లో థియేటర్ల వద్ద భారీగా ప్రేక్షకులు పోటెత్తారు. 'ఇరుముడి’ జోరు ఎంతగా ఉందో మూడో రోజు బుకింగ్స్ను చూస్తే అర్థమవుతోంది. ఆదివారం రోజున బుక్మైషో వేదికగా ఏకంగా 4.05 లక్షలకు పైగా టికెట్లు అమ్ముడైనట్లు సమాచారం. తెలుగు రాష్ట్రాల్లోని అనేక థియేటర్లలో షోలు హౌస్ఫుల్ కావడం సినిమాకు పెరుగుతున్న క్రేజ్ను తెలియజేస్తోంది.
మొదటి రెండు రోజులు మంచి వసూళ్లు సాధించిన తర్వాత కూడా సినిమా జోరు తగ్గకపోవడం విశేషం. సాధారణంగా వీకెండ్ తర్వాత కలెక్షన్లు తగ్గే అవకాశం ఉన్నప్పటికీ, 'ఇరుముడి' విషయంలో మాత్రం ప్రేక్షకుల ఆసక్తి ఇంకా కొనసాగుతోంది. ఈ చిత్రం విడుదలైన తొలి రెండు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.50 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించినట్లు సమాచారం. మూడో రోజు కూడా భారీ బుకింగ్స్ నమోదవడంతో మరో మంచి వసూళ్లను రాబట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. వీకెండ్ ముగిసే సమయానికి సినిమా బాక్సాఫీస్ వద్ద మరింత భారీ మైలురాయిని చేరుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇప్పటివరకు బుక్మేషో, డిస్ట్రిక్ట్ వంటి టికెటింగ్ ప్లాట్ఫామ్లలో కలిపి 25 లక్షలకు పైగా టికెట్లు అమ్ముడైనట్లు తెలుస్తోంది. ఇది సినిమాకు ప్రేక్షకుల్లో ఉన్న ఆదరణకు నిదర్శనంగా చెప్పొచ్చు. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి వస్తున్న స్పందన కూడా 'ఇరుముడి'కి అదనపు బలంగా మారింది. వీకెండ్ ముగిసిన తర్వాత అసలు పరీక్ష సోమవారం నుంచే మొదలవుతుంది. అయితే 'ఇరుముడి' సోమవారం అడ్వాన్స్ బుకింగ్స్ కూడా ఆశాజనకంగా ఉన్నట్లు సమాచారం. పాజిటివ్ వర్డ్ ఆఫ్ మౌత్ కారణంగా ఇంకా చాలా మంది ప్రేక్షకులు సినిమా చూసేందుకు ఆసక్తి చూపుతున్నారు. మొదటి రోజు సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా ద్వారా తమ అభిప్రాయాలను పంచుకోవడం కూడా చిత్రానికి బాగా కలిసొస్తోంది. మంచి కంటెంట్ ఉంటే స్టార్ పవర్తో పాటు ప్రేక్షకుల ఆదరణ కూడా ఎంత పెద్ద స్థాయిలో ఉంటుందో 'ఇరుముడి' మరోసారి నిరూపిస్తోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..