
తిరుపతి, 31 ఆగస్టు (హి.స.)
, చంద్రగిరి మండలంలోని బాకరాపేట ఘాట్ రోడ్డులో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. మహారాష్ట్ర నుంచి తిరుపతి వైపు వెళ్లే లారీ మార్గమధ్యంలో ప్రమాదవశాత్తూ కొండను ఢీకొట్టడంతో మంటలు చెలరేగి అక్కడికక్కడే దగ్ధమైంది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ త్రుటిలో తప్పించుకుని ప్రాణాలు నిలుపుకున్నారు.
వివరాల్లోకి వెళితే.. పైప్ల లోడ్తో ఓ లారీ మహారాష్ట్రలోని బరంపూర్ నుంచి తిరుపతి వైపు వెళ్తోంది. చంద్రగిరి సమీపంలోని బాకరాపేట ఘాట్ రోడ్డు వద్దకు చేరుకోగానే ప్రమాదవశాత్తూ కొండగుట్టను ఢీకొట్టింది. దీంతో లారీ ఇంజిన్లో మంటలు చెలరేగాయి. గమనించిన డ్రైవర్ చాకచక్యంగా లారీ నుంచి బయటకు దూకారు.
ఆ తర్వాత మంటలు వేగంగా వ్యాపించడంతో లారీ పూర్తిగా కాలిపోయింది. గమనించిన వాహనదారులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో వారు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. అప్పటికే లారీ మంటల్లో పూర్తిగా కాలిపోయింది. ఈ ఘటనపై చంద్రగిరి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ