
అమరావతి, 31 ఆగస్టు (హి.స
ఇంద్రకీలాద్రి, జగన్మాత దుర్గమ్మ అలంకరణ నిమిత్తం రూ.11లక్షల విలువైన బంగారు జడను దుర్గగుడి పాలకమండలి ఛైర్మన్ బొర్రా రాధాకృష్ణ(గాంధీ) కుటుంబం విరాళంగా అందజేశారు. లక్ష్మీదేవి, ఇతర దైవిక రూపాలు కలిగిన బంగారు జడలో ఆకుపచ్చ రంగు విలువైన రాళ్లు, ముత్యాలు పొదిగి ఉన్నాయి. ఈ సందర్భంగా ఛైర్మన్ రాధాకృష్ణ మాట్లాడుతూ.. 20 ఏళ్ల క్రితం దుర్గగుడికి వచ్చినప్పుడు అమ్మవారికి బంగారు జడ చేయించాలన్న ఆలోచన వచ్చిందన్నారు. అప్పుడు చేసిన సంకల్పం దుర్గగుడి ఛైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత కుటుంబ సభ్యులు, మిత్రుల సహకారంతో అమ్మవారి మొక్కును విజయవంతంగా నెరవేర్చానన్న సంతృప్తి కలిగిందన్నారు. ఛైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తనతో పరిచయం ఉన్న మిత్రులు స్వచ్ఛందంగా శివాలయం అభివృద్ధి, అన్నదానం, ఉచిత ప్రసాదం, బంగారం, వెండి ఆభరణాలు, గోసంరక్షణ పథకాలకు రూ.1.16 కోట్ల విరాళాలు తన హయాంలో అమ్మవారి ఆలయానికి అందజేశారని తెలిపారు. మరో 15 రోజుల్లో రూ.75లక్షల విలువ చేసే బంగారు కిరీటం(డైమండ్స్ పొదిగిన) అమ్మవారికి విరాళంగా ఇచ్చేందుకు తన మిత్రుడు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. దేవస్థానం ఈవో శీనానాయక్, స్థానాచార్య శివప్రసాదశర్మ, ప్రధానార్చకులు దుర్గాప్రసాద్, వైదిక కమిటీ సభ్యులు కోట ప్రసాద్, శ్రీధర్శర్మ, ఈఈ రమాదేవి, పాలకమండలి సభ్యులు అవ్వారు శ్రీనివాసరావు, రాఘవరాజు, సరిత తదితరులు పాల్గొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ