ప్రాతినిధ్యమే ముఖ్యం, గ్లోబల్ సౌత్ దేశాల గొంతును బలంగా వినిపించిన ప్రధాని మోదీ
ప్రాతినిధ్యమే ముఖ్యం, గ్లోబల్ సౌత్ దేశాల గొంతును బలంగా వినిపించిన ప్రధాని మోదీ
modi


న్యూఢిల్లీ, సెప్టెంబ‌ర్ 13(హి.స‌)

ప్రస్తుత ప్రపంచ పాలనా వ్యవస్థ ఒక 'పిరమిడ్'లా మారిపోయిందని, దీనిని వెంటనే మార్చాల్సిన అవసరం ఉందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. బ్రిక్స్ (BRICS) శిఖరాగ్ర సమ్మేళనంలో భాగంగా 'సమ్మిళిత ప్రపంచ పాలన, బహుళ‌జాతీయతను బలోపేతం చేయడం' అనే అంశంపై జరిగిన ప్రత్యేక సదస్సుకు ఆయన అధ్యక్షత వహించి ప్రసంగించారు. ఈ సందర్భంగా గ్లోబల్ సౌత్ (అభివృద్ధి చెందుతున్న దేశాలు) గళాన్ని అంతర్జాతీయ వేదికపై బలంగా వినిపిస్తూ కీలకమైన ప్రతిపాదనలు పారేశారు. ప్రపంచ దేశాల నిర్ణయాలు ప్రభావితం చేసే దేశాలు అడుగున ఉంటే, కేవలం కొద్దిమంది చేతుల్లోనే అధికార కేంద్రీకరణ జరగడాన్ని ఆయన 'విశేషాధిపత్యాల పిరమిడ్' (Pyramid of Privilege)గా అభివర్ణించారు.

ఈ విధానాన్ని మార్చి ప్రతి దేశానికి భాగస్వామ్యం కల్పించేలా 'భాగస్వామ్య వేదిక' (Platform of Partnership)గా తీర్చిదిద్దాల్సిన సమయం ఆసన్నమైందని పేర్కొన్నారు. ప్రపంచ సంక్షోభాలను ఎదుర్కోవడంలో గ్లోబల్ సౌత్ దేశాలు ముందు వరుసలో ఉంటున్నప్పటికీ, నిర్ణయాలు తీసుకునే ప్రక్రియలో మాత్రం వెనుకబడిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రపంచ పాలనా సంస్కరణల కోసం పది సూత్రాలతో కూడిన ఒక ప్రత్యేక 'బ్రిక్స్ రిఫార్మ్ రోడ్‌మ్యాప్'ను తదుపరి శిఖరాగ్ర సమ్మేళనం నాటికి రూపొందించాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రాతినిధ్యం (Representation), జవాబుదారీతనం (Responsiveness), మరియు నిబంధనల రూపకల్పన (Rule-making) అనే మూడు ప్రధాన ప్రాతిపదికలపై ఈ రోడ్‌మ్యాప్ ఆధారపడి ఉండాలని సూచించారు.

ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి (UNSC) సంస్కరణలను ఇకపై ఎంతమాత్రం ఆలస్యం చేయకూడదని, అంతర్జాతీయ ఆర్థిక సంస్థల్లో కూడా అభివృద్ధి చెందుతున్న దేశాలకు తగిన ఓటింగ్ హక్కులు మరియు ప్రాధాన్యత లభించాలని డిమాండ్ చేశారు. అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), సైబర్ స్పేస్, అంతరిక్షం మరియు బయోటెక్నాలజీ వంటి భవిష్యత్తు రంగాల్లో గ్లోబల్ సౌత్ దేశాలు కేవలం నిబంధనలు పాటించేవిగా (Rule-takers) కాకుండా, వాటిని నిర్దేశించే శక్తిగా (Rule-shapers) ఎదగాలని పిలుపునిచ్చారు. సముద్ర వాణిజ్యంలో కీలక పాత్ర పోషిస్తున్న నావికుల (Seafarers) రక్షణ కోసం ప్రత్యేకంగా 'సీఫేరర్స్ ఎమర్జెన్సీ సపోర్ట్ నెట్‌వర్క్'ను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. బ్రిక్స్ అధ్యక్ష బాధ్యతలు ఏటా మారుతున్నప్పటికీ సంస్థాగత వృద్ధిలో వేగం తగ్గకుండా ఉండేందుకు 'ట్రోయ్కా' తరహా నిరంతర అమలు యంత్రాంగాన్ని తీసుకురావాలని ప్రధాని మోదీ ఆకాంక్షించారు.

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande