
ఢిల్లీ , 14 సెప్టెంబర్ (హి.స.)కేంద్ర హోంమంత్రి అమిత్ షా సంచలన ప్రకటన చేశారు.
రాబోయే 2029 సార్వత్రిక ఎన్నికల లోపు భారతీయ జనతా పార్టీ, మిత్రపక్షాలు అధికారంలో ఉన్న మొత్తం 21 రాష్ట్రాల్లో యూసీసీని కచ్చితంగా అమలు చేసి తీరుతామని అన్నారు. ఒకే దేశం, ఒకే చట్టం విధానం బీజేపీ ప్రధాన ఎజెండా అని అన్నారు. అందరికీ ఒకే చట్టం ఉంటేనే సమాజంలో నిజమైన అభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు. ఇప్పటికే ఉత్తరాఖండ్ రాష్ట్రంలో యూసీసీని విజయవంతంగా అమల్లోకి తెచ్చామని, త్వరలోనే అసోం, గుజరాత్ లాంటి మిగతా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ దిశగా కసరత్తు ప్రారంభించాయని హోంమంత్రి గుర్తుచేశారు.
ఏకరూప చట్టంతో సమాన హక్కులు
దేశంలోని పౌరులందరికీ మతం, కులం, వర్గం లాంటి భేదాలు లేకుండా వివాహం, విడాకులు, ఆస్తి పంపకాలు, దత్తత లాంటి వ్యక్తిగత అంశాల్లో ఒకే విధమైన న్యాయం ఉండాలన్నదే యూసీసీ ప్రధాన ఉద్దేశం అన్నారు. ప్రస్తుతం దేశంలో వివిధ మతాలకు వేర్వేరు వ్యక్తిగత చట్టాలు అమల్లో ఉన్నాయి. దీనివల్ల న్యాయపరమైన చిక్కులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు అని వివరించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్