
హైదరాబాద్, 16 సెప్టెంబర్ (హి.స)
భారత్ సహా ఐదు ప్రధాన దేశాల నుంచి వచ్చే వస్తువులపై ఏకంగా 100 శాతం వరకు దిగుమతి సుంకాలను విధించేందుకు వీలు కల్పించే కీలక ఆంక్షల బిల్లును అమెరికా ప్రతినిధుల సభ తుది ఓటింగ్కు సిద్ధం చేసింది. రష్యా-ఇరాన్లపై ఆర్థిక ఒత్తిడిని తీవ్రతరం చేసే లక్ష్యంతో రూపొందించిన 'లిండ్సే గ్రాహం సాంక్షనింగ్ రష్యా అండ్ ఇరాన్ యాక్ట్ 2026' ఇప్పటికే సెనేట్ ఆమోదం పొందగా, తాజాగా ప్రతినిధుల సభలో రూల్స్ కమిటీ పరిశీలన అనంతరం రేపటి తుది ఆమోద ప్రక్రియకు మార్గం సుగమమైంది.
ఉక్రెయిన్తో యుద్ధం వేళ రష్యా ఇంధన రంగం నుంచి వస్తున్న నిధుల ప్రవాహాన్ని అడ్డుకోవడమే ధ్యేయంగా తీసుకొచ్చిన ఈ ద్వైపాక్షిక బిల్లు ప్రతినిధుల సభలోనూ సులభంగా నెగ్గే అవకాశముందని అక్కడి రాజకీయ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.ఈ చట్టం అమల్లోకి వస్తే రష్యా నుంచి గరిష్ట పరిమాణంలో చమురు కొనుగోలు చేస్తున్న భారత్, చైనా వంటి దేశాల ఉత్పత్తులపై సెకండరీ టారిఫ్లు విధించే ప్రత్యేక కార్యనిర్వాహక అధికారం అమెరికా అధ్యక్షుడికి దక్కుతుంది. ఈ ముసాయిదా ప్రతిపాదనలతో భారత ఫార్మా, టెక్స్టైల్స్, ఇంజనీరింగ్ తదితర ఎగుమతి రంగాలపై తీవ్ర ప్రభావం పడే ప్రమాదముందని వాణిజ్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..