
హైదరాబాద్, 17 సెప్టెంబర్ (హి.స.)
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కీసర పోలీస్ స్టేషన్ కు చెందిన ఎస్సై జ్ఞానేందర్ రెడ్డి రూ.5 లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు హ్యాండెడ్గా పట్టుబడ్డారు. సీఐ ఆంజనేయులు ఆదేశాల మేరకు లంచం తీసుకుంటున్నట్టు అధికారులు గుర్తించారు. అనంతరం కీసర పోలీస్ స్టేషన్లో సుదీర్ఘంగా సోదాలు నిర్వహించిన ఏసీబీ అధికారులు, లంచం నగదును రికవరీ చేసి సీఐ ఆంజనేయులు, ఎస్సై జ్ఞానేందర్ రెడ్డి ఇద్దరినీ అరెస్ట్ చేశారు.
వీరిద్దరి అరెస్టుతో కీసర పరిసర ప్రాంతాల్లో ఒక్కసారిగా సంచలనం రేగగా, పోలీస్ స్టేషన్ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. సీఐ, ఎస్సైలు ఏసీబీకి చిక్కడంపై స్థానిక ప్రజల్లో అనూహ్య స్పందన వ్యక్తమైంది. గత కొంతకాలంగా వివిధ వివాదాలు, కేసుల పరిష్కారం కోసం వీరిద్దరూ లంచాల పేరిట ప్రజలను తీవ్రంగా వేధించారని ఆగ్రహం వ్యక్తం చేసిన కీసర, బోగారం గ్రామస్తులు పోలీస్ స్టేషన్ ఎదుటే బాణాసంచా కాల్చి, సంబరాలు జరుపుకున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..