
ములుగు, 17 సెప్టెంబర్ (హి.స.)
అన్ని రంగాల్లో ములుగు జిల్లాను మరింత అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని మంత్రి సీతక్క అన్నారు.
అమరుల ఆశయాలను నెరవేర్చేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. జిల్లాలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రత్యేక నిధులు కేటాయిస్తున్నారని, ఆశించిన మేరకు అభివృద్ధి పనులను పూర్తి చేస్తున్నామని తెలిపారు.
గురువారం తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా నూతన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ భవనంలో జిల్లా కలెక్టర్ బోర్కేడే హేమంత్ సహదేవ్రావు, జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్తో కలిసి మంత్రి జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా జిల్లా ప్రజలను ఉద్దేశించి సీతక్క మాట్లాడారు.
సెప్టెంబర్ 17వ తేదీ భారతదేశంతో పాటు తెలంగాణ చరిత్రలోనూ విశిష్టమైన స్థానాన్ని కలిగి ఉందన్నారు. నిజాం పాలనతో పాటు రజాకారుల అరాచకాలను ఎదిరించిన ఘనత తెలంగాణ ప్రజలకు దక్కుతుందని తెలిపారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు