
మంత్రాలయం, 17 సెప్టెంబర్ (హి.స.)కర్నూలు జిల్లా మంత్రాలయంలో శ్రీ రాఘవేంద్ర స్వామిని దర్శించుకునేందుకు ప్రముఖ సినీ నటుడు రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల మంత్రాలయానికి చేరుకున్నారు.
కర్నూలు జిల్లాలో ఇవాళ (గురువారం) ప్రముఖ సినీ నటుడు రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల పర్యటించారు. ఈ రోజు ఉదయం మంత్రాలయంలోని శ్రీ రాఘవేంద్ర స్వామి ఆలయాన్ని దర్శించుకుని ఆమె ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేక హెలికాప్టర్లో దేవాలయానికి చేరుకున్న ఉపాసనకు ఆలయ అధికారులు, సిబ్బంది ఘనస్వాగతం పలికారు.
ముందుగా గ్రామదేవత మంచాలమ్మను ఉపాసన దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శ్రీ రాఘవేంద్ర స్వామి మూలబృందావనాన్ని దర్శించి పూజా, అభిషేక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వామివారికి ఆమె మొక్కులు చెల్లించుకున్నారు.
అనంతరం టీటీడీ సూపరింటెండెంట్ గురురాజాచార్ను శ్రీమఠం ప్రాంగణంలో ఆశీర్వదించారు.. ఉపాసనను శేషవస్త్రం, ఫల మంత్రాక్షింతలతో పాటుగా రాఘవేంద్ర స్వామి జ్ఞాపికను అందజేశారు. అనంతరం ఉపాసనను మఠం పీఠాధిపతి శ్రీ సుబుధేంద్ర తీర్థ స్వామి ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందజేశారు.
స్వామివారి ఆశీస్సులు పొందడం ఆనందంగా ఉందని ఆమె పేర్కొన్నారు.
మరోవైపు, తమ అభిమాన హీరో రామ్చరణ్ సతీమణి మంత్రాలయానికి వచ్చిన విషయం తెలుసుకున్న అభిమానులు, భక్తులు ఉపాసనను చూసేందుకు ఆసక్తి కనబరిచారు. దీంతో ఆలయ పరిసరాల్లో సందడి వాతావరణం నెలకొంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV