ఏపీలో రూ.22,178 కోట్ల కొత్త పెట్టుబడులకు ఆమోదం
ఆంధ్రప్రదేశ్లో పారిశ్రామిక పెట్టుబడులపై ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.
AP Govt


అమరావతి , 20 సెప్టెంబర్ (హి.స.)

ఆంధ్రప్రదేశ్లో పారిశ్రామిక పెట్టుబడులపై ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి 28 కొత్త పారిశ్రామిక ప్రాజెక్టులకు మొత్తం రూ.22,177.84 కోట్ల పెట్టుబడులకు ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టుల ద్వారా 19,739 మందికి ఉపాధి అవకాశాలు ఏర్పడే అవకాశం ఉందని ప్రభుత్వం వెల్లడించింది. ఈ పెట్టుబడులు ఒక్క రంగానికే పరిమితం కాకుండా ఇంధనం, ఐటీ, కమ్యూనికేషన్స్, ఆహార ప్రాసెసింగ్, తయారీ, పర్యాటకం తదితర రంగాలకు విస్తరించాయి. రాష్ట్రంలో పెట్టుబడులను పెంచడం ద్వారా ఉపాధి అవకాశాలను విస్తరించడంతో పాటు పారిశ్రామిక మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం చర్యలు చేపడుతోంది.

రాష్ట్రానికి 974 కిలోమీటర్ల పొడవైన సముద్రతీరం ఉన్న నేపథ్యంలో పోర్టు ఆధారిత పారిశ్రామిక అభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. పోర్టులను రోడ్డు, రైలు, విమాన రవాణా వ్యవస్థలతో అనుసంధానించడం ద్వారా సరుకు రవాణా ఖర్చులు, సమయం తగ్గించవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. దీనివల్ల ఎగుమతులకు కూడా అవకాశాలు పెరిగే అవకాశం ఉంది.

సెమీకండక్టర్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటమ్ టెక్నాలజీ, ఫోటోనిక్స్, డ్రోన్లు, బయోటెక్నాలజీ వంటి అధునాతన రంగాలను కూడా పెట్టుబడుల విధానంలో భాగం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande