
హైదరాబాద్, 20 సెప్టెంబర్ (హి.స.)
హైదరాబాద్ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. నైరుతి రుతుపవనాలు, ఆవర్తన ప్రభావంతో నగరాన్ని నల్లటి మబ్బులు కమ్మేసి, ఉరుములు, మెరుపులతో కూడిన వాన పడుతోంది.
జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, మాదాపూర్, గచ్చిబౌలి, శంషాబాద్, రాజేంద్రనగర్, సరూర్‌నగర్, సికింద్రాబాద్, కూకట్‌పల్లి మరియు పాతబస్తీ పరిసర ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. దీనివల్ల రోడ్లపై భారీగా నీరు చేరి ప్రధాన కూడళ్లలో వాహనాల రాకపోకలు మందగించాయి. రహదారులపై ట్రాఫిక్ జాం కావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
మరోవైపు హైదరాబాద్‌తో పాటు తెలంగాణలోని పలు జిల్లాలకు వాతావరణ శాఖ వర్ష హెచ్చరికలు జారీ చేసింది. రాబోయే కొన్ని గంటల్లో నగరంలో మరింత వర్షం కురిసే అవకాశం ఉందని, ప్రజలు, వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi