

న్యూఢిల్లీ, 22 సెప్టెంబర్ (హి.స.): ఉపరాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ మంగళవారం ఇక్కడ 9వ 'భారత్ అంతర్జాతీయ జల సప్తాహం-2026' (IIWW-2026) ప్రారంభోత్సవ కార్యక్రమంలో మాట్లాడుతూ.. జల భద్రతతోనే ప్రజా భద్రత, దేశ భద్రత సుసాధ్యమవుతాయని, నీటి వనరుల సంరక్షణను ప్రజా భాగస్వామ్యంతో ఒక ప్రజా ఉద్యమంగా మార్చాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
భారత్ మండపంలో సెప్టెంబర్ 22 నుండి 26 వరకు జరిగే IIWW-2026 ను ఉద్దేశించి ఉపరాష్ట్రపతి మాట్లాడుతూ, నీరే జీవనానికి, నాగరికతలకు ఆధారమని అన్నారు. నీటిని విచక్షణాయుతంగా ఉపయోగించడం, సంరక్షించడం, సమర్థవంతంగా నిర్వహించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కి చెప్పారు.
ఈ కార్యక్రమంలో కేంద్ర జలశక్తి మంత్రి సి.ఆర్. పాటిల్, జలశక్తి సహాయ మంత్రులు వి. సోమన్న, రాజ్ భూషణ్ చౌదరి, జలశక్తి మంత్రిత్వ శాఖ కార్యదర్శి అర్చన వర్మ, తాగునీరు, పారిశుధ్య శాఖ కార్యదర్శి అశోక్ కె. మీనా, కేంద్ర జల కమిషన్ అధ్యక్షుడు అనుపమ్ ప్రసాద్‌తో పాటు దేశ విదేశాలకు చెందిన ప్రతినిధులు, నిపుణులు పాల్గొన్నారు. ఈ ఏడాది ఈ కార్యక్రమం ప్రధాన ఇతివృత్తం (థీమ్)- 'వాతావరణ అనుకూల జల నిర్వహణ'.
రాధాకృష్ణన్ తమిళనాడులో గడిపిన తన చిన్ననాటి అనుభవాలను గుర్తు చేసుకుంటూ, తాను స్వయంగా నీటి ఎద్దడిని చూశానని, ప్రజలకు తాగునీరు అందించడం ఎంత ముఖ్యమో గ్రహించానని చెప్పారు. నీటిని పొదుపు చేయడం మానవాళికి, మొత్తం ప్రపంచానికి అత్యంత కీలకమైనదని ఆయన అన్నారు.
రెండు దశాబ్దాల క్రితం తమిళనాడులో నదుల అనుసంధానం, జల సంరక్షణ, నీటి వనరుల సరైన నిర్వహణపై అవగాహన పెంచేందుకు దాదాపు 19 వేల కిలోమీటర్ల మేర రథయాత్ర నిర్వహించినట్లు తెలిపారు. నదుల అనుసంధానం అనే ఆలోచన.. ఒక ప్రాంతం వరదలను ఎదుర్కొంటుంటే, మరో ప్రాంతం కరువు పరిస్థితులను ఎదుర్కొనే వైపరీత్యాలను అధిగమించడానికి సహాయపడుతుందని పేర్కొన్నారు.
ప్రపంచంలోని మొత్తం భూభాగంలో భారత్ దాదాపు 2.4 శాతం, ప్రపంచ జనాభాలో దాదాపు 18 శాతం కలిగి ఉందని, అయితే ప్రపంచ మంచినీటి వనరులలో భారత్ వాటా కేవలం 4 శాతం మాత్రమేనని ఆయన అన్నారు. ఇటువంటి పరిస్థితిలో నీటి లభ్యత ఎక్కువగా ఉండి, జనాభా తక్కువగా ఉండే ఇతర దేశాలతో భారతదేశ నీటి అవసరాలను పోల్చలేమని తెలిపారు.
రాష్ట్రాల మధ్య నీటి పంపిణీకి సంబంధించిన అంశాల్లో సహకారం అత్యంత ముఖ్యమైనదని ఉపరాష్ట్రపతి అన్నారు. నీటి వివాదాలు, సవాళ్లకు సహకారంతోనే పరిష్కారం సాధ్యమవుతుందని చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వాన్ని ప్రశంసిస్తూ.. నీటి పంపిణీపై అంతర్రాష్ట్ర సహకారం కోసం ఇప్పటివరకు 10 అవగాహన ఒప్పందాలపై (MoUs) సంతకాలు జరిగినట్లు తెలిపారు. ఆరు రాష్ట్రాల మధ్య కుదిరిన కిషౌ బహుళార్ధసాధక ప్రాజెక్టును అంతర్రాష్ట్ర సహకారానికి ఒక ముఖ్యమైన ఉదాహరణగా పేర్కొన్నారు.
జలశక్తి మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ అంతర్జాతీయ కార్యక్రమంలో నెదర్లాండ్స్, జర్మనీ భాగస్వామ్య దేశాలుగా పాల్గొంటున్నాయి. దేశంలోని 14 రాష్ట్రాలు కూడా ఇందులో పాల్గొంటుండగా, ఆరు కేంద్ర మంత్రిత్వ శాఖలు, విభాగాలను భాగస్వాములుగా ఆహ్వానించారు. ఈ ఈవెంట్‌లో భాగంగా సెప్టెంబర్ 25 వరకు నాలుగు రోజుల పాటు అంతర్జాతీయ ప్రదర్శన కూడా జరుగుతోంది, ఇందులో సుస్థిర, వాతావరణ అనుకూల జల నిర్వహణకు సంబంధించిన ఆధునిక సాంకేతికతలు, పరిష్కారాలను ప్రదర్శించనున్నారు. తాగునీరు, పారిశుధ్య శాఖ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 22 నుండి 24 వరకు రెండవ అంతర్జాతీయ WASH సదస్సు-2026 కూడా నిర్వహించబడుతోంది.
ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి 'సుస్థిర పట్టణ నదీ నిర్వహణ' (SURM) ఫ్రేమ్‌వర్క్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), మెషిన్ లెర్నింగ్ (ML) ఆధారిత సమీకృత జలాశయ పూడిక నిర్వహణ సాంకేతిక పత్రాన్ని ఆవిష్కరించారు. SURM ఫ్రేమ్‌వర్క్‌లో నదీ పరివాహక ప్రాంతాల అనుసంధానం, వాతావరణ అనుకూలత, జీవవైవిధ్యం, సమగ్ర పాలన, సర్క్యులర్ ఎకానమీ, నదులపై ఆధారపడిన సుస్థిర ఆర్థిక వ్యవస్థలను పరిగణనలోకి తీసుకున్నారు. ఇక AI, మెషిన్ లెర్నింగ్ ఆధారిత విధానం ద్వారా జలాశయాల్లో పూడిక పేరుకుపోవడాన్ని అంచనా వేయడం, భవిష్యత్తులో నీటి నిల్వ సామర్థ్యంలో వచ్చే తగ్గుదలను ముందస్తుగా ఊహించడం, దాని నిర్వహణ చర్యలను గుర్తించడంలో సహాయపడుతుంది.
జలశక్తి మంత్రి సి.ఆర్. పాటిల్ మాట్లాడుతూ నీరు అందరి ఉమ్మడి వనరు అని, కాబట్టి జల భద్రత కూడా అందరి ఉమ్మడి బాధ్యత అని అన్నారు. నీరు ఏ సరిహద్దులకు లోబడి ఉండదు. నదులు ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి పారుతాయి, భూగర్భ జలాలు అనేక సమాజాలను అనుసంధానిస్తాయి, వర్షపాతం ఎక్కువైనా లేదా తగ్గినా సుదూర ప్రాంతాలలో వరదలు లేదా కరువుకు కారణమవుతుంది. అందువల్ల జల నిర్వహణను విడివిడిగా కాకుండా సమగ్ర కోణంలో చూడాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
భారతదేశం బృహత్తర స్థాయిలో జల నిర్వహణ రంగంలో గణనీయమైన అనుభవాన్ని గడించిందని, ఇప్పుడు ఈ అనుభవాలను ప్రపంచంతో పంచుకోవడంతో పాటు ఇతర దేశాల అనుభవాల నుండి నేర్చుకోవాలని కోరుకుంటోందని పాటిల్ అన్నారు. 'జల్ జీవన్ మిషన్' దీనికి ఒక గొప్ప ఉదాహరణ అని పేర్కొన్నారు. 2019లో దాదాపు 3.24 కోట్ల గ్రామీణ కుటుంబాలకు మాత్రమే కుళాయి నీటి సదుపాయం ఉండగా, ఇప్పుడు ఆ సంఖ్య దాదాపు 16 కోట్ల కుటుంబాలకు చేరిందని చెప్పారు.
'జల సంచయ్ జన భాగీదారి', 'కేచ్ ది రెయిన్' ద్వారా నీటి సంరక్షణను ప్రజల భాగస్వామ్యంతో అనుసంధానించామని ఆయన తెలిపారు. ఈ ఏడాది మే 31 నాటికి జల సంరక్షణ, భూగర్భ జలాల పునరుద్ధరణకు సంబంధించి 1.5 కోట్లకు పైగా నిర్మాణాలను చేపట్టడం జరిగిందన్నారు. ఏదైనా నదిని స్వచ్ఛంగా, జీవంతంగా మార్చడానికి మురుగునీటి నిర్వహణ, కాలుష్య నియంత్రణ, జీవవైవిధ్యం, స్థానిక సమాజం, మొత్తం నదీ పరివాహక ప్రాంతాన్ని ఏకం చేసి ముందుకు సాగడం అవసరమని అన్నారు. నీటికి సంబంధించిన సమస్యలు ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నందున, వాటి పరిష్కారాలు కూడా సమగ్రంగా ఉండాలని సూచించారు.
జల వనరులు, నదుల అభివృద్ధి, గంగా పునరుజ్జీవన శాఖ కార్యదర్శి అర్చన వర్మ మాట్లాడుతూ భారతదేశంలో జల నిర్వహణ అనేది ప్రాథమికంగా ఒక సహకార ప్రయత్నమని, విధానాలు, సాంకేతికతలు, వినూత్న ఆలోచనలను క్షేత్రస్థాయిలో ఫలితాలుగా మార్చడానికి రాష్ట్రాల క్రియాశీల భాగస్వామ్యం అత్యంత ఆవశ్యకమని అన్నారు. ఇండియా ఇంటర్నేషనల్ వాటర్ వీక్ అనేది జల రంగానికి చెందిన సంభాషణలు, జ్ఞాన మార్పిడి, సాంకేతిక ప్రదర్శనలు, భాగస్వామ్య అవకాశాలను అందించే ఒక ముఖ్యమైన బహుళ-పక్ష, బహుళ-విషయాల ప్రపంచ వేదికగా రూపుదిద్దుకుందని చెప్పారు.
ఈ ఏడాది ఇతివృత్తం “వాతావరణ అనుకూల జల నిర్వహణ” ప్రస్తుత సమయానికి ఎంతో ప్రాముఖ్యమైనదని ఆమె అన్నారు. వాతావరణ మార్పుల అత్యంత స్పష్టమైన ప్రభావం నీటి ద్వారానే కనిపిస్తుంది. మారుతున్న వర్షపాత నమూనాలు, వరదలు, కరువుల తీవ్రత, పౌనఃపున్యం పెరగడం, భూగర్భ జలాలపై ఒత్తిడి, హిమానీనదాలలో మార్పులు, నీటి లభ్యతలో పెరుగుతున్న అనిశ్చితి జల నిర్వహణ సవాళ్లను పెంచాయని వివరించారు. వాతావరణ అనుకూలత కోసం జల వనరులు, మౌలిక వసతుల ప్రణాళిక, నిధుల సమీకరణ, అభివృద్ధి, నిర్వహణలలో వాతావరణ అంశాలను చేర్చడం అత్యవసరమని అన్నారు.
IIWW-2026 లో ఏడు ఉప-ఇతివృత్తాల కింద వివిధ ఉన్నత స్థాయి, సాంకేతిక సమావేశాలు నిర్వహిస్తున్నట్లు అర్చన వర్మ తెలిపారు. అంతర్జాతీయ ప్రదర్శనలో వాతావరణ అనుకూల జల నిర్వహణ కోసం కొత్త సాంకేతికతలు, ఆచరణాత్మక పరిష్కారాలను ప్రదర్శిస్తున్నారు. రెండవ అంతర్జాతీయ WASH సదస్సు ద్వారా తాగునీరు, పారిశుధ్యం, పరిశుభ్రత ప్రవర్తన, వాతావరణ అనుకూలతపై చర్చలు మరింత బలోపేతం అవుతాయని ఆమె పేర్కొన్నారు. యువ నిపుణులు, పరిశోధకులు, స్టార్టప్‌లు, ఆవిష్కర్తల భాగస్వామ్యం కూడా ఎంతో కీలకమైనదని తెలిపారు.
తాగునీరు, పారిశుధ్య శాఖ కార్యదర్శి అశోక్ కె.కె. మీనా మాట్లాడుతూ వాతావరణ మార్పు అనేది ఒక అంతర్జాతీయ ప్రక్రియ అయినప్పటికీ, దాని ప్రభావం స్థానిక స్థాయిలో అనుభూతి చెందుతుందని, దీని అత్యంత స్పష్టమైన ప్రభావం నీటి ద్వారానే బయటపడుతుందని చెప్పారు. కరువు, వరదలు, భూగర్భ జలమట్టాలు పడిపోవడం, నీటి వనరులపై పెరుగుతున్న ఒత్తిడి.. రోజువారీ అవసరాల కోసం ఈ వనరులపై ఆధారపడే వర్గాలను నేరుగా ప్రభావితం చేస్తాయని పేర్కొన్నారు.
2024లో ప్రచురితమైన గ్లోబల్ కమిషన్ ఆన్ ది ఎకనామిక్స్ ఆఫ్ వాటర్ నివేదిక “ది ఎకనామిక్స్ ఆఫ్ వాటర్: వాల్యూయింగ్ ది హైడ్రోలాజికల్ సైకిల్ యాజ్ ఏ గ్లోబల్ కామన్ గుడ్” ని ప్రస్తావిస్తూ, జల చక్రాన్ని ఒక ప్రపంచ ఉమ్మడి వనరుగా గుర్తించి నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు. సహజ జల చక్రమే ప్రకృతి అత్యంత విజయవంతమైన జల నిర్వహణ వ్యవస్థ అని అన్నారు. వర్షపు నీరు నదులు, సరస్సులు, భూగర్భ జలధారలను నింపుతుందని, సమాజాలు, పర్యావరణ వ్యవస్థల ద్వారా ఉపయోగించబడి, ఆపై మళ్లీ సహజ చక్రంలోకి చేరుతుందని వివరించారు.
జల వ్యవస్థలను ప్రకృతి జల చక్రానికి అనుగుణంగా పనిచేసేలా రూపకల్పన చేయడం, నిర్వహించడమే మన ముందున్న సవాలని మీనా అన్నారు. చాలా కాలంగా నీటిని తోడటం, ఒక చోటు నుండి మరొక చోటికి తరలించడం, వాడటం, ఆ తర్వాత వదిలేయడం జరుగుతోందని, వాతావరణ అనుకూల భవిష్యత్తు కోసం ఈ చక్రాన్ని మూసివేయడం అత్యవసరమని చెప్పారు. జల నిర్వహణ అనేది సహజ వ్యవస్థకు ఎంత దగ్గరగా ఉంటే, అది అంత సుస్థిరంగా, స్థితిస్థాపకంగా (రీసిలియంట్) ఉంటుందని వివరించారు.
ప్రభుత్వం మౌలిక సదుపాయాల నిర్మాణంతో పాటు స్థానిక సామర్థ్యాన్ని బలోపేతం చేయడంపై కూడా పెట్టుబడి పెడుతోందని ఆయన తెలిపారు. యూనిసెఫ్ (UNICEF) సహకారంతో వాతావరణ అనుకూల పారిశుధ్య మౌలిక సదుపాయాల ప్రోటోకాల్‌లను అభివృద్ధి చేశామని, ఇందులో గ్రే వాటర్ (మురుగునీటి) నిర్వహణను ఒక ముఖ్యమైన వాతావరణ అనుకూల వ్యూహంగా చేర్చామని అన్నారు. ప్రతి నీటి బొట్టు స్థానిక స్థాయిలో శుద్ధి, పునర్వినియోగం, పునరుద్ధరణ ద్వారా తన చక్రాన్ని పూర్తి చేసుకోవాలని చెప్పారు. స్థానిక స్థాయిలో జల చక్రం ఎంత ఎక్కువగా పూర్తయితే, కార్బన్ ఫుట్‌ప్రింట్ అంత తగ్గి, సమాజం అంతగా నిలదొక్కుకోగలదని పేర్కొన్నారు.
భారతదేశ అంతర్జాతీయ జల కార్యక్రమం భావన 2012లో ‘ఇండియా వాటర్ వీక్’ పేరుతో ఒక ప్రధాన కార్యక్రమంగా ప్రారంభమైంది. ప్రపంచ జల సవాళ్లకు పరిష్కారాలను కనుగొనడం, సుస్థిరాభివృద్ధిని ప్రోత్సహించడం, జల రంగంలో నూతన పరిష్కారాలను ప్రదర్శించడం దీని ప్రధాన లక్ష్యం. కాలక్రమేణా ఈ ఈవెంట్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న విధానకర్తలు, పరిశోధకులు, పరిశ్రమల అధిపతులు, వర్గాలను ఒకే వేదికపైకి తెచ్చే ఒక ముఖ్యమైన అంతర్జాతీయ వేదికగా మారింది. 2012 నుండి ఇప్పటివరకు ఇండియా వాటర్ వీక్ ఎనిమిది ఎడిషన్లు నిర్వహించబడ్డాయి. అవి 2012, 2013, 2015, 2016, 2017, 2019, 2022, 2024 సంవత్సరాలు. ప్రస్తుతం ఈ కార్యక్రమాన్ని ‘భారత్ అంతర్జాతీయ జల సప్తాహం’ పేరుతో నిర్వహిస్తున్నారు.
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi