
అమరావతి , 23 సెప్టెంబర్ (హి.స.)తీవ్ర వాయుగుండం ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. భారీ వర్షాలు, వరదలు సంభవించే అవకాశాలను దృష్టిలో ఉంచుకుని ముందస్తు రక్షణ చర్యలను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా ప్రజల ప్రాణ రక్షణకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.
వరదల ప్రభావం ఎక్కువగా ఉండే ప్రాంతాలను ముందుగానే గుర్తించి అక్కడి ప్రజలను అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు తరలించే విధంగా ప్రణాళికలు సిద్ధం చేయాలని సీఎం సూచించిచారు . రహదారులు దెబ్బతిన్న ప్రాంతాల్లో మరమ్మతు పనులను ఆలస్యం చేయకుండా చేపట్టాలని, రవాణా నిలిచిపోయే పరిస్థితి వస్తే ప్రత్యామ్నాయ మార్గాలను సిద్ధంగా ఉంచాలని అధికారులను ఆదేశించారు. పునరావాస కేంద్రాల నిర్వహణపైనా సమావేశంలో ప్రత్యేక దృష్టి పెట్టారు. వరద ప్రభావిత ప్రజలను తరలించాల్సి వస్తే వారికి తాగునీరు, ఆహారం, మందులు, విద్యుత్, పారిశుధ్యం వంటి ప్రాథమిక సదుపాయాలు అందుబాటులో ఉండేలా చూడాలని ఆదేశించారు. మహిళలు, పిల్లలు, వృద్ధులు, అనారోగ్యంతో ఉన్నవారికి ప్రత్యేక సహాయం అందించేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్