ఉత్తరప్రదేశ్లో తీవ్ర కలకలం: రక్షక భటులే భక్షకులుగా మారి యువతిపై సామూహిక అత్యాచారం
ఉత్తరప్రదేశ్లో తీవ్ర కలకలం: రక్షక భటులే భక్షకులుగా మారి యువతిపై సామూహిక అత్యాచారం
Rape case


అమ్రోహా, 24 సెప్టెంబర్ (హి.స.)

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అమ్రోహా జిల్లాలో శాంతిభద్రతలను కాపాడాల్సిన పోలీసులే కామంతో కళ్లుమూసుకుని అత్యంత హేయమైన చర్యకు పాల్పడ్డారు. రక్షించాల్సిన వారే భక్షకులుగా మారిన ఈ ఉదంతం దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టిస్తోంది.

హరియాణాకు చెందిన 23 ఏళ్ల యువతిని సీఆర్‌పీఎఫ్‌కు చెందిన ఇద్దరు జవాన్లు పవిత్ర స్థలాలను చూపిస్తామనే నెపంతో నమ్మించి అమ్రోహాకు తీసుకువచ్చారు. మార్గమధ్యలో ఆ యువతిని స్థానిక అస్త్రాసి-హసన్‌పూర్ మార్గంలో ఉన్న ఒక ఫాంహౌస్‌కు చేర్చారు. అక్కడ హసన్‌పూర్ పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న ఒక సబ్-ఇన్‌స్పెక్టర్, మరో కానిస్టేబుల్ కూడా వారితో కలిశారు.

ఆ ఫాంహౌస్‌లో నిందితులంతా కలిసి బాధితురాలిపై అత్యంత అమానుషంగా సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అయితే ఆపదలో ఉన్న ఆ యువతి చాకచక్యంగా వ్యవహరించి, నిందితుల కన్నుగప్పి ధైర్యంగా పోలీసుల సహాయక నంబరుకు ఫోన్ చేసి సమాచారం అందించింది. వెంటనే అప్రమత్తమైన ఉన్నతాధికారులు మరియు స్థానిక పోలీసులు అర్ధరాత్రి ఆ ఫాంహౌస్‌పై దాడి చేసి బాధితురాలిని సురక్షితంగా రక్షించారు.

ఈ దుర్ఘటనలో ప్రమేయం ఉన్న ఉత్తరప్రదేశ్ పోలీసు శాఖకు చెందిన సబ్-ఇన్‌స్పెక్టర్, కానిస్టేబుల్‌తో పాటు సీఆర్‌పీఎఫ్ సిబ్బందిని పోలీసులు తక్షణమే అరెస్ట్ చేశారు. నిందితులపై భారతీయ న్యాయసంహిత (BNS) సంబంధిత సెక్షన్ల కింద తీవ్రమైన అభియోగాలతో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి కోర్టులో హాజరుపరిచారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించి, నేరానికి సహకరించిన స్థానిక పోలీసు అధికారులను ఉన్నతాధికారులు వెంటనే సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఘటనపై సర్వత్రా తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande