
ఢిల్లీ, 30 సెప్టెంబర్ (హి.స.)
దేశ రాజధాని ఢిల్లీలో 'స్వచ్ఛతా హీ సేవా 2026' (Swachhata Hi Seva 2026) కార్యక్రమంలో భాగంగా కేంద్ర సామాజిక న్యాయం. సాధికారత మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో 'సఫాయిమిత్ర సురక్ష ఏవం సమ్మాన్ శిబిర్' (Safaimitra Suraksha Evam Samman Shivir) అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించబడింది. న్యూఢిల్లీలోని డాక్టర్ ఎస్.పి.ఎం. సివిక్ సెంటర్‌లోని కేదార్‌నాథ్ సాహ్ని ఆడిటోరియంలో ఈ ప్రధాన వేడుక హైబ్రిడ్ విధానంలో కొనసాగింది.
సమాజంలో పారిశుద్ధ్య కార్మికులు (సఫాయిమిత్రులు) అందిస్తున్న అమూల్యమైన సేవలను గుర్తించి వారిని గౌరవించడం, అలాగే వారి ఆరోగ్యం, భద్రత మరియు సామాజిక రక్షణ చర్యలను మెరుగుపరచడమే ఈ శిబిరం ప్రధాన ఉద్దేశం. సమ్మాన్ సఫాయి మిట్రోం కా, సంకల్ప్ స్వచ్ఛ భారత్ కా అనే నినాదంతో ఈ శిబిరాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో దేశవ్యాప్తంగా ఉన్న గ్రామీణ, పట్టణ స్థానిక సంస్థలు (ULBs, RLBs) వర్చువల్ విధానం ద్వారా పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పారిశుద్ధ్య కార్మికులకు మెరుగైన ఆరోగ్య సేవలు అందించడంతో పాటు, 'నమస్తే' (NAMASTE) పథకం కింద వారికి అవసరమైన భద్రతా పరికరాలు, సంక్షేమ పథకాలను చేరవేయడంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 17 వరకు కొనసాగుతున్న ఈ స్వచ్ఛతా ఉద్యమంలో భాగంగా పారిశుద్ధ్య కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతను ఈ శిబిరం మరోసారి చాటిచెప్పింది.
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi