
హైదరాబాద్, 05 సెప్టెంబర్ (హి.స.)
భారీ స్పోర్ట్స్ ఫీజుల పెంపును వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ నగరంలోని ఎల్బీ స్టేడియం వద్ద శనివారం క్రీడాకారులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పెద్ద ఎత్తున నిరసన ఆందోళన చేపట్టారు. సెప్టెంబర్ 1వ తేదీ నుంచి అమల్లోకి వచ్చిన కొత్త 'పే అండ్ ప్లే' (Pay & Play) ఫీజులతో పేద, మధ్యతరగతి కుటుంబాలపై తీవ్రమైన అదనపు ఆర్థిక భారం పడుతోందని వారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. క్రీడలను ప్రోత్సహించాల్సిన ప్రభుత్వమే ఈ విధంగా వ్యాపార ధోరణితో ఫీజులను అమాంతం పెంచడం వల్ల భవిష్యత్ తరాల క్రీడాకారులు ప్రాక్టీస్కు దూరమయ్యే ప్రమాదం ఉందని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ప్రభుత్వ క్రీడా సదుపాయాలు కేవలం సంపన్నులకే కాకుండా అందరికీ అందుబాటులో ఉండాలని, పేద, దిగువ మధ్యతరగతి వర్గాలకు చెందిన పిల్లలకు ప్రత్యేక రాయితీలు కల్పించాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు. అలాగే రాష్ట్ర, జాతీయ స్థాయిలో ప్రతిభకనబరిచే క్రీడాకారులకు 100 శాతం పూర్తి ఫీజు మినహాయింపు ఇవ్వాలని స్పష్టం చేశారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి పెంచిన క్రీడా ఫీజులను రద్దు చేయకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని స్టేడియాల పరిధిలో ఆందోళనలను మరింత తీవ్రతరం చేస్తామని క్రీడాకారులు, వారి తల్లిదండ్రులు హెచ్చరించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు