అమరావతి, 1 అక్టోబర్ (హి.స.)తెలుగు సినీ పరిశ్రమకు వేల కోట్ల నష్టాన్ని కలిగిస్తున్న పైరసీ వెబ్‌సైట్ 'ఐబొమ్మ' వ్యవహారం కొత్త మలుపు తీసుకుంది. ఇప్పటివరకు సినీ నిర్మాతలను, హీరోలను బెదిరిస్తూ వచ్చిన ఈ సైట్ నిర్వాహకులు, ఇప్పుడు ఏకంగా హైదరాబాద్ పోలీసులకే సవాల్ విసిరారు. తమపై దృష్టి సారిస్తే తాము కూడా పోలీసులపై దృష్టి పెట్టాల్సి వస్తుందంటూ బహిరంగంగా హెచ్చరించడం సంచలనం సృష్టిస్తోంది.
ఇటీవల తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (TFCC), ఐబొమ్మ సహా 65 పైరసీ వెబ్‌సైట్లపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదును తీవ్రంగా పరిగణించిన పోలీసులు, దర్యాప్తు చేపట్టి ఒక పైరసీ ముఠాను ఛేదించి ఐదుగురిని అరెస్టు చేశారు. ఈ సందర్భంగా సీపీ సీవీ ఆనంద్ మాట్లాడుతూ, ఐబొమ్మ వంటి సైట్లను ఎంతటి సాంకేతికత వాడినా వదిలిపెట్టేది లేదని, అంతర్జాతీయ సంస్థల సహకారంతో వారిని పట్టుకుంటామని గట్టి హెచ్చరికలు జారీ చేశారు.
సీపీ చేసిన ఈ హెచ్చరికలపై ఐబొమ్మ నిర్వాహకులు స్పందిస్తూ ఒక లేఖ విడుదల చేశారు. మీరు మాపై ఫోకస్ చేస్తే.. మేము మీపై ఫోకస్ చేయాల్సి ఉంటుంది అంటూ పోలీసులకే ఎదురు వార్నింగ్ ఇచ్చారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV