హైదరాబాద్, 1 అక్టోబర్ (హి.స.)
పాక్ క్రికెట్ బోర్డు చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ భారత క్రికెట్ బోర్డుకు క్షమాపణలు చెప్పాడు. ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్ తర్వాత జరిగిన పరిణామాలకు క్షమాపణలు చెప్పినట్లుగా ఇండియా టుడే కథనం ప్రచురించింది. మంగళవారం జరిగిన ఏసీసీ సమావేశంలో నఖ్వీ క్షమాపణలు చెప్పాడంటూ విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఫైనల్ మ్యాచ్లో పాకిస్తాన్పై టీమిండియా విజయం సాధించిన విషయం తెలిసిందే. ఏసీసీ చైర్మన్గా ఉన్న పీసీబీ చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ నుంచి ట్రోఫీ, పతకాలు అందుకునేందుకు భారత జట్టు నిరాకరించింది. ఆ తర్వాత టీమిండియా కప్ను లేకుండానే సంబురాలు చేసుకుంది. ఆ తర్వాత కప్ను నఖ్వీ మైదానం నుంచి బయటకు తీసుకువెళ్లాలని ఏసీసీ అధికారులను ఆదేశించారు.
మంగళవారం జరిగిన ఆసియా క్రికెట్ కౌన్సిల్ సమావేశంలో ఆసియా కప్ ట్రోఫీ వివాదంలో మొహ్సిన్ నఖ్వీ వ్యవహరించిన తీరుపై బీసీసీఐ తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేసింది. సమావేశానికి హాజరైన బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా. కీలక వ్యాఖ్యలు చేశారు. ట్రోఫీ ఏసీసీ ఆస్తి, పీసీబీ చీఫ్ ఆస్తి కాదని స్పష్టం చేశారు. ట్రోఫీ, పతకాలు హోటల్ గదికి తీసుకువెళ్లే అధికారం నఖ్వీకి లేదని గుర్తు చేశారు. సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని టీమిండియా జట్టుకు ట్రోఫీని సరైన పద్ధతిలో అప్పగించాలని, తక్షణమే ఏసీసీ సంరక్షణలో ఉండాలని బీసీసీఐ డిమాండ్ చేస్తోందని శుక్లా స్పష్టం చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..