కర్నూలు, 16 అక్టోబర్ (హి.స.)ఎలాంటి ఫలితాలు ఆశించకుండా కేవలం దేశ సేవే పరమావధిగా పని చేస్తున్న ప్రధాన నరేంద్ర మోడీ (PM Narendra Modi)ని మనం కర్మయోగిగా చూస్తున్నామని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pavan Kalyan) అన్నారు.
ఇవాళ కేంద్రం ప్రవేశపెట్టిన జీఎస్టీ 2.0 (GST 2.0) సంస్కరణలతో ప్రజలకు కలిగే ప్రయోజనాలను వివరించి చెప్పేందుకు కర్నూలులో ఏర్పాటు చేసిన ‘సూపర్ జీఎస్టీ.. సూపర్ సేవింగ్స్’ బహిరంగ ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ.. మోదీ దేశాన్ని మాత్రమే కాదని, రెండు తరాలను నడుపుతున్నారని తెలిపారు.
ప్రపంచమంతా దేశం వైపు తలెత్తి చూసే విధంగా ఆత్మనిర్భర్ భారత్ తీసుకొచ్చారని కొనియాడారు. ఒక తరం కోసం ఆలోచించే నాయకుడు చంద్రబాబు అంటూ ప్రశంసించారు. కూటమి 15 ఏళ్లకు తక్కువ కాకుండా బలంగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీతో పాటు సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ సహా పలువురు మంత్రులు, ప్రముఖులు హాజరయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల నిర్మించిన, నిర్మించబోతున్న రూ.13,429 కోట్ల విలువైన ప్రాజెక్టులకు ప్రధాని నరేంద్రమోదీ వర్చువల్‌గా ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV