హైదరాబాద్, 17 అక్టోబర్ (హి.స.)
స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు
నిర్వహిస్తారో చెప్పాలని తెలంగాణ ప్రభుత్వం, ఎన్నికల కమిషన్ను హైకోర్టు ప్రశ్నించింది. స్థానిక సంస్థలకు సంబంధించి రీ నోటిఫికేషన్ ఇవ్వాలంటూ సురేందర్ అనే న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారని ప్రశ్నించింది. సుప్రీంకోర్టు కూడా ఎన్నికలకు వెళ్లాలని సూచించింది కదా అని గుర్తు చేసింది. దీంతో సుప్రీంకోర్టు చెప్పింది కానీ కోర్టు ఆర్డర్ కాపీలో ఎక్కడా లేదని ఈసీ తరపు న్యాయవాది చెప్పారు.
మాటల్లో మాత్రమే చెప్పారన్నారు. నిన్ననే ప్రభుత్వానికి లేఖ రాశామని, ప్రభుత్వంతో చర్చించిన తరవాతే రీ నోటిఫికేషన్ ఉంటుందని కోర్టుకు తెలిపారు. దీంతో ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తామో చెప్పేందుకు రెండు వారాల సమయం కావాలని ప్రభుత్వం, ఎలక్షన్ కమిషన్ కోరగా హైకోర్టు ఇందుకు అంగీకరించింది. తదుపరి విచారణ రెండు వారాలకు వాయిదా వేసింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..