ఖమ్మం, 18 అక్టోబర్ (హి.స.)
ఖమ్మం జిల్లా రాజకీయాల్లో మరో కీలక
మార్పునకు రంగం సిద్ధమైనట్లు కనిపిస్తోంది. అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే బిఆర్ఎస్ సీనియర్ నాయకులు తాటి వెంకటేశ్వర్లు, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును శనివారం మంత్రి నివాసంలో కలవడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. మర్యాదపూర్వక భేటీ గానే దీన్ని చెబుతున్నప్పటికీ, దీని వెనుక తాటి వెంకటేశ్వర్లు రాజకీయ భవిష్యత్తుకు సంబంధించిన కీలక నిర్ణయం ఉందనే ఊహాగానాలు జోరందుకున్నాయి.
ఇటీవల మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు బిఆర్ఎస్లోని నాయకత్వంపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు రేగ కాంతారావు, అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు పార్టీలో ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆయన బహిరంగంగానే విమర్శలు చేశారు. తనకు, తన అనుచరులకు పార్టీలో సరైన గౌరవం దక్కడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు