హైదరాబాద్, 18 అక్టోబర్ (హి.స.)
బీసీ రిజర్వేషన్ల విషయంలో తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం దిశగా అడుగులు వేస్తోందా? ఇన్నాళ్లు బహిర్గతం చేయని కులగణన సర్వే వివరాలను ప్రభుత్వం బహిర్గతం చేయబోతోందా? తాజాగా మంత్రి వాకిటి శ్రీహరి చేసిన వ్యాఖ్యలు ఆసక్తిగా మారాయి. డెడికేషన్ కమిషన్ రిపోర్టును ప్రభుత్వం బయటపెట్టలేదని, నిజంగానే కాంగ్రెస్కు చిత్తశుద్ధి ఉంటే ఈ వివరాలు బయటపెట్టేవాళ్లు కదా అని ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్న వేళ మంత్రి వాకిటి శ్రీహరి (Vakiti Srihari) సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే డెడికేషన్ కమిషన్, బీసీ కమిషన్, ఎంపిరికల్ డేటా (Empirical data) అంతా పబ్లిష్ చేస్తామన్నారు. ఇవాళ బీసీ బంద్లో పాల్గొన్న ఆయన ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. ఎంపిరికల్ డేటా వివరాలు బయటపెట్టక పోవడానికి కొన్ని ఆంక్షలు ఉన్నాయని ఎవరూ అడ్డంకులు సృష్టించకూడదనే ఈ వివరాలు పబ్లిక్ డొమైన్లో ఇంత కాలం పెట్టలేదన్నారు. కానీ కోర్టుల్లో సమర్పించిన వివరాలతోనే ఇన్ని అడ్డంకులు సృష్టిస్తున్నారని చెప్పారు. మా చిత్తశుద్ధిని శంకించాల్సిన అవసరం ఎవరికీ లేదన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు