కరీంనగర్, 21 అక్టోబర్ (హి.స.) కరీంనగర్ జిల్లా గంగాధర మండల పరిధిలో మంగళవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టి అనంతరం చెట్టును ఢీకొన్న కారు పూర్తిగా ధ్వంసమైంది. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనదారుడు, కారు డ్రైవర్ ఇద్దరు మృతి చెందారు. వివరాల్లోకి వెళితే, కరీంనగర్ జగిత్యాల రహదారిపై వేగంగా వెళ్తున్న కారు ద్విచక్ర వాహనాన్ని వెనుక నుంచి ఢీకొట్టింది. ఢీకొన్న వేగం కారణంగా కారు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీకొట్టింది. ఫలితంగా కారు ముందు భాగం ధ్వంసమై డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు.
మృతుడైన కారు డ్రైవర్ను కొండన్నపల్లె గ్రామానికి చెందిన విన్నర్ పాఠశాల అధినేత మల్లయ్య గా గుర్తించారు. ద్విచక్ర వాహనదారుడు కూడా తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. అతని వివరాలు తెలియాల్సి ఉంది. స్థానికులు సమాచారం ఇవ్వడంతో గంగాధర పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు