అమరావతి, 21 అక్టోబర్ (హి.స.)
ఏపీ తీరానికి తీవ్ర వాయుగండం ముప్పు పొంచి ఉంది. నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం బలపడుతోంది. తీవ్ర వాయుగుండంగా మారిన తర్వాత దక్షిణ కోస్తా, ఉత్తర తమిళనాడు తీరానికి సమీపిస్తుందని ఐఎండీ అంచనా వేసింది. ప్రస్తుతం తీవ్ర వాయుగుండం మరింత విస్తరిస్తే తుఫాన్‌గా కూడా రూపాంతరం చెందే చాన్స్ కనిపిస్తోంది. మరోవైపు ఈనెల 26న అండమాన్ దగ్గర మరో అల్పపీడనం పుట్టేందుకు అనుకూలమైన వాతావారణం ఉంది. వీటి ప్రభావంతో దక్షిణ కోస్తాలో వచ్చే ఐదు రోజులు భారీ వర్షాలు, రాష్ట్రంలోని మిగిలిన జిల్లాలో మోస్తరు వానలు పడనున్నాయి.
దక్షిణ కోస్తా జిల్లాలైన నెల్లూరు, తిరుపతితో పాటుగా రాయలసీమ జిల్లాలు అయిన చిత్తూరు, అన్నమయ్య జిల్లాలలో రాబోయే 24 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా జిల్లా అయిన ప్రకాశంతో పాటుగా వైయస్సార్ కడప, సత్యసాయి జిల్లాలో ఒకటి రెండు చోట్ల భారీ వర్షపాతం నమోదయ్య అవకాశం ఉంది. రాబోవు ఐదు రోజుల్లో కోస్తా జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది.
దక్షిణ కోస్తా జిల్లాల తీరానికి వెంబడి, ఆవల అనుకొని ఉన్న కొన్నిచోట్ల 35 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది. ఈనెల 23 ,24 తేదీల్లో 50 నుండి 70 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలుల వీచే అవకాశం ఉంది. మత్స్యకారులు సురక్షితం ప్రాంతాలకు చేరుకోవాలని, వేటకు వెళ్ళవద్దని అధికారులు ఆదేశాలు జారీ చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ