నరసరావుపేట, 21 అక్టోబర్ (హి.స.), శివ, కేశవులకు ప్రీతిపాత్రమైన కార్తిక మాసంలో కోటప్పకొండపై ఈనెల 22 నుంచి నవంబరు 20 వరకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈ సందర్భంగా భక్తుల రాక ఎక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలో స్వామి దర్శనానికి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన వసతులు కల్పించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఉచిత దర్శనంతో పాటు ప్రత్యేక దర్శనం, శీఘ్ర దర్శనం లైన్ల ద్వారా భక్తులను అనుమతిస్తారు. సోమ, ఆదివారాలు, కార్తిక పౌర్ణమి రోజుల్లో భక్తుల తాకిడి ఎక్కువగా ఉండనున్న నేపథ్యంలో స్వామికి ఆలయంలోని మండపంలో అభిషేకాలు చేస్తారు. ఆయా రోజుల్లో మూలవిరాట్టుకు వేకువజామున మహన్యాసపూర్వక రుద్రాభిషేకం, అలంకరణలు చేసి భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. సాధారణ రోజుల్లో యథావిధిగా భక్తులు మూలవిరాట్టుకు అభిషేకం చేయించుకోవచ్చు. అలాగే కార్తిక పౌర్ణమి నాడు జ్వాలతోరణం ఘనంగా నిర్వహిస్తారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ