అమరావతి, 21 అక్టోబర్ (హి.స.)పోలీస్ అమరవీరుల దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి అచ్చెన్నాయుడు పాల్గొన్నారు. అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. చాలా సమస్యలు ఉన్నాయని.. అయినా ఉద్యోగులకు అండగా ఉంటున్నామన్నారు. అందరు ఉద్యోగులకు డీఏ ఇచ్చామని తెలిపారు. పోలీస్ రిక్రూటమెంట్ జరగాల్సిన అవసరం ఉందని చెప్పారు. గత ఐదు సంవత్సరాల పాలనలో రిక్రూట్‌మెంట్ చేయలేదన్నారు. 6 వేల ఉద్యోగాలను కూటమి ప్రభుత్వం రిక్రూట్ చేసిందని.. త్వరలో పోస్టింగ్ ఇస్తామని వెల్లడించారు. అందరం కలిసి శాంతి భద్రతలను కాపాడుదామని పిలుపునిచ్చారు. పోలీస్ స్టేషన్‌లు, క్వార్టర్లు సరిగాలేవని.. పోలీస్ స్టేషన్‌ల అభివృద్ధిపై దృష్టిపెడతామని స్పష్టం చేశారు. పోలీసులు, వారి కుటుంబాలకు ఇబ్బందులు లేకుండా చూస్తామన్నారు. అమరవీరుల త్యాగాలు మరువలేమని.. వారికి నివాళులు అర్పిస్తున్నామని మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.
మరోవైపు ఏలూరు పోలీస్ పరేడ్ గ్రౌండ్లో పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రేంజ్ డీఐజీ అశోక్ కుమార్, జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి, జిల్లా ఎస్పీ శివ ప్రతాప్ కిషోర్ పాల్గొన్నారు. పోలీస్ స్థూపం వద్ద పోలీస్ అమరవీరులకు పోలీస్ అధికారులు నివాళలర్పించారు. ఈ సందర్భంగా ఏలూరు రేంజ్ డీఐజీ అశోక్ కుమార్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో శాంతి భద్రతల విషయంలో పోలీస్ శాఖ పాత్ర కీలకమన్నారు. దేశంలో 191 మంది పోలీసులు దేశం కోసం ప్రాణత్యాగం చేశారని వెల్లడించారు. పోలీస్ అమరవీరుల కుటుంబాలకు పోలీస్ శాఖ ఎప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ నుంచి ఈ సంవత్సరం ఐదుగురు పోలీసులు అమరులయ్యారని ఏలూరు రేంజ్ డీఐజీ అశోక్ కుమార్ వెల్లడించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV