
అమరావతి, 23 అక్టోబర్ (హి.స.),:పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం డీఎస్పీ జయసూర్యకు మంచి ట్రాక్ రికార్డు ఉందని అసెంబ్లీ ఉప సభాపతి రఘురామకృష్ణరాజు చెప్పారు. బుధవారం విశాఖలో ఆయన విలేకరులతో మాట్లాడారు. వారు అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ.. డీఎస్పీ మంచి అధికారి అని తనకు రిపోర్టు ఉందని.. భీమవరంలో చోరీకి గురైన వాహనాలు, ఇతర సొత్తు రికవరీలో ఆయన బాగా పనిచేస్తున్నారని తెలిపారు. అయినా విచారణ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలుంటాయని.. ఆయన తప్పుచేసినట్లు తేలితే చర్యలు తీసుకుంటారని.. లేదంటే ఉండవని చెప్పారు.
జూదంపై రాష్ట్రప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోందని, ఎక్కడా రాజీపడడం లేదన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో పోలీసులు గట్టి నిఘా పెట్టారని, ఉండి ప్రాంతంలో పేకాట శిబిరాలు లేవని చెప్పారు. గోదావరి జిల్లాల్లో చాలామంది పేకాట ఆడుతుంటారని, 13 ముక్కలాట ఆడుకోవచ్చని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందని తెలిపారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తన శాఖతో పాటు ఇతర శాఖలపై దృష్టి పెట్టడం సంతోషమన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ