
హైదరాబాద్, 23 అక్టోబర్ (హి.స.)
సీనియర్ ఐఏఎస్ అధికారి సయ్యద్ అలీ మూర్తజ రిజ్వీ స్వచ్ఛంద పదవీ విరమణ (వీఆర్ఎస్) చేశారు. వీఆర్ఎస్కు ఆయన పెట్టుకొన్న దరఖాస్తును ప్రభుత్వం ఆమోదించిన విషయం తెలిసిందే. ఈ నెల 31 నుంచి రిజ్వీ పదవీ విరమణ అమల్లోకి వస్తుందని సీఎస్ రామకృష్ణారావు బుధవారం ఉత్తర్వులు కూడా జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఒక్కసారిగా ఎక్సైజ్ శాఖలో అంతర్గత విభేదాలు బయటపడ్డాయి. తాజాగా, ఎక్సైజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సయ్యద్ అలీ ముర్తజా రిజ్వీ వీఆర్ఎస్కు ఎట్టి పరిస్థితుల్లో అనుమతి ఇవ్వొద్దని ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సీఎస్ రామకృష్ణారావుతో పాటు సీఎం రేవంత్ రెడ్డికి కూడా లేఖ రాశారు.
అయితే, రిజ్వీ తన పట్ల అనుచితంగా ప్రవర్తించడమే కాకుండా అక్రమాలకు పాల్పడినట్లు మంత్రి జూపల్లి కష్ణారావు ఆ లేఖలో ప్రస్తావించారు. విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించారని.. మంత్రిగా తన విధులకు కూడా ఆటంకం కలిగించారని పేర్కొన్నారు. దీంతో పాటు తన శాఖలో రిజ్వీ చేసిన కొన్ని పనులను మంత్రి సీఎస్ రామకృష్ణారావు దృష్టికి తీసుకొచ్చారు. మద్యం బాటిళ్లపై సెక్యూరిటీ కోసం హోలోగ్రామ్ (Hologram) స్టిక్కర్ల కాంట్రాక్టును 11 ఏళ్లు ఒకే కంపెనీకి ఇస్తున్నారని ఆరోపించారు. హోలోగ్రామ్ స్టికర్లను మరింత భద్రతతో, లేబుల్స్ మార్చి టెండర్లు పిలవాలని చెప్పినా కనీసం పట్టించుకోలేదని మళ్లీ పాత వారికే కాంట్రాక్టు కట్టబెట్టారని లేఖలో జూపల్లి ప్రస్తావించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..