
ఢిల్లీ,23, అక్టోబర్ (హి.స.)మలేసియా (Malaysia) రాజధాని కౌలాలంపూర్‌లో అక్టోబరు 26 నుంచి 28 వరకు ఆసియాన్ సదస్సు (ASEAN summit) జరగనుంది. అయితే, ఈ సదస్సుకు భారత ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) హాజరు కావడం లేదు. దీంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump), మోదీల మధ్య భేటీ లేనట్లే.
షెడ్యూల్ సమస్యల వల్లే మోదీ ఇందులో పాల్గొనలేకపోతున్నట్లు తెలుస్తోంది. దీంతో మోదీకి బదులుగా విదేశాంగ మంత్రి జైశంకర్ భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తారని అధికారిక వర్గాలు తెలిపాయి. ఈ విషయాన్ని ప్రధాని మోదీ తాజాగా ధ్రువీకరించారు. మలేసియా ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో ఫోన్‌లో మాట్లాడినట్లు ఆయన ఎక్స్ వేదికగా తెలిపారు. అక్కడ జరగనున్న ఆసియాన్ సదస్సుల్లో వర్చువల్‌గా పాల్గొననున్నట్లు వెల్లడించారు. ఈ సదస్సు విజయవంతం కావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఈ ఆసియాన్- భారత్‌ల వ్యూహాత్మక భాగస్వామ్య బలోపేతానికి ఎదురుచూస్తున్నట్లు రాసుకొచ్చారు. ఈ సదస్సుకు వెళ్లని నేపథ్యంలో కంబోడియా పర్యటన కూడా వాయిదా పడింది. ఇక, ఈ సదస్సుకు ట్రంప్‌తో సహా అనేక దేశాల నాయకులు హాజరుకానున్నారు. భారత ప్రధాని గైర్హాజరు నేపథ్యంలో మోదీ, ట్రంప్‌ల భేటీ కూడా జరగదు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ