
హైదరాబాద్, 23 అక్టోబర్ (హి.స.)
హైదరాబాద్ నుంచి గోవాకు రైలులో వెళ్లే వారికి మరో మార్గం అందుబాటులోకి రానుంది. వికారాబాద్ నుంచి కొడంగల్ మీదుగా రాయచూరుకు సమీపంలో ఉన్న కృష్ణా రైల్వే స్టేషన్ వరకు కొత్త రైల్వే లైన్ నిర్మించేందుకు మార్గం సుగమమైంది. ఈ రైల్వే ప్రాజెక్టుకు ఎంతో కీలకమైన 845 హెక్టార్ల భూ సేకరణకు కోసం రూ.438 కోట్లు ఖర్చు చేసేందుకు ఇటీవల రాష్ట్ర కేబినెట్ తీర్మానం చేసింది. దీంతో ఈ రైల్వే మార్గం ఏర్పాటు కు తొలి అడుగు విజయవంతంగా పడింది. సికింద్రాబాద్ నుంచి వికారాబాద్ మీదుగా రాయచూర్ వెళ్లేందుకు ప్రస్తుతం తాండూరు, సేడం, చిత్తాపూర్, వాడి, యాద్గిర్ మీదుగా చుట్టూ తిరిగి వెళ్లాల్సి వస్తోంది. ఫలితంగా సమయం, ఇంధనం వృథా అవుతుంది. సికింద్రాబాద్ నుంచి రాయచూరుకు 290 కి.మీ దూరం అవుతుంది. ఈ మార్గానికి ప్రత్యామ్నాయంగా రైల్వేశాఖ వికారాబాద్-కృష్ణా మార్గాన్ని తెరపైకి తీసుకువచ్చింది.
రూ.2,196 కోట్ల అంచనా వ్యయంతో రైల్వేశాఖ ప్రతిపాదించిన ఈ వికారాబాద్-కృష్ణా రైల్వే లైన్ పూర్తయితే కొడంగల్ నియోజకవర్గం తో పాటు వికారాబాద్, నారాయణపేట జిల్లాలు ఎంతో అభివృద్ధి చెందేందుకు అవకాశం ఏర్పడుతుంది. సికింద్రాబాద్ నుంచి రాయచూరు చేరుకునేందుకు ప్రస్తుతం వాడి, యాద్గిర్ మీదుగా చుట్టూ తిరిగి వెళ్లడం వల్ల 290 కి.మీ దూరం ప్రయాణించాల్సి వస్తుంది. వికారాబాద్-కృష్ణా కొత్త లైన్ వల్ల సుమారు 100 కి.మీ మేర దూరం తగ్గుతుంది. ప్రస్తుతం సికింద్రాబాద్ నుంచి వికారాబాద్కు 72 కి.మీ దూరం కాగా... కొత్తగా 122 కి.మీ మేర లైన్ నిర్మించనున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు