
ఢిల్లీ,23, అక్టోబర్ (హి.స.) కేంద్ర ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దేశ వ్యాప్తంగా ఓటరు సమగ్ర సవరణ (Special Intensive Revision-SIR) చేపట్టాలని నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ చేపట్టింది. దీనిపై విపక్ష పార్టీలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టినా.. తర్వాత సైలెంట్ అయిపోయాయి. బంగ్లాదేశ్, మయన్మార్ సహా ఆయా దేశాల నుంచి వచ్చిన వారంతా ఆయా రాష్ట్రాల్లో తిష్ట వేసిన నేపథ్యంలో ఈసీ సర్వే చేపట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా సర్వే చేపట్టాకే బీహార్ ఎన్నికల షెడ్యూల్‌ను ఈసీ విడుదల చేసింది.
ఎన్నికల సంఘం చేపట్టిన సర్వే బీహార్‌లో విజయవంతం కావడంతో వచ్చే ఏడాదిలో పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అస్సాం, కేరళ, పుదుచ్చేరి, తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌లతో పాటు ఇతర రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా రాష్ట్రాల్లో దశలవారీగా ఓటరు సమగ్ర సవరణ సర్వే చేపట్టాలని ఈసీ భావిస్తోంది. తొలుత ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్నాయో.. ఆ రాష్ట్రంలో సర్వే ప్రారంభించి అనంతరం క్రమక్రమంగా అన్ని రాష్ట్రాల్లో సర్వే చేపట్టాలని ఆలోచన చేస్తోంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ