
అమరావతి, 24 అక్టోబర్ (హి.స.): కర్నూలు జిల్లా చిన్నటేకూరులో జరిగిన ప్రైవేట్ బస్సు ప్రమాదంపై డీఐజీ కోయ ప్రవీణ్ స్పందించారు. ఘటనకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. బస్సులో 38 మంది పెద్దలు, ఇద్దరు పిల్లలు ఉన్నారని చెప్పారు. ప్రమాదం జరిగిన వెంటనే 11 మృతదేహాలను వెలికితీశామన్నారు. ప్రస్తుతం బస్సు ప్రధాన డ్రైవర్ పరారీలో ఉన్నాడని, మరొక డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నామని డీఐజీ తెలిపారు.
బైక్‌ను ఢీకొని మంటలు చెలరేగడంతో ప్రమాదం సంభవించిందని స్పష్టం చేశారు. క్షతగాత్రులకు తక్షణమే వైద్య సేవలు అందిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ప్రమాద పరిణామాలను అంచనా వేసి, స్థానిక అధికారులు, వైద్యులు క్షతగాత్రుల ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తున్నట్లు డీఐజీ కోయ ప్రవీణ్ తెలిపారు.
కాగా, ఇప్పటికే ప్రమాదస్థలానికి ఎఫ్ఎస్ఎల్ టీమ్ చేరుకుందని ఎస్పీ విక్రాంత్ తెలిపారు. బెంగళూరు వెళ్తున్న బస్సు బైక్‌ను ఢీకొట్టిందని, ఎమర్జెన్సీ డోర్స్ పగలగొట్టి కొందరు బయటపడ్డా.. మరికొంత మంది రాలేకపోయారన్నారు. మంటలతో బస్సులో ఉన్నవారికి తీవ్రగాయాలయ్యాయని ఎస్పీ విక్రాంత్ పేర్కొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV