
కర్నూలు, 24 అక్టోబర్ (హి.స.)
:కల్లూరు మండలం చిన్నటేకూరులో జరిగిన ఘోర బస్సు ప్రమాదం పలువురు కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న వి. కావేరి ట్రావెల్స్ బస్సు చిన్నటేకూరు దగ్గర బైకును ఢీకొట్టడంతో మంటలు చెలరేగాయి. ఆ వెంటనే బస్సు మొత్తం పూర్తిగా దగ్ధమైంది. ప్రమాద సమయంలో బస్సులో 43 మంది ప్రయాణికులు ఉండగా.. 20 మంది ప్రయాణికులు మంటల్లో సజీవదహనమయ్యారు. మరి కొంత మంది ప్రయాణికులు తమ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బస్సు అద్దాలు పగలగొట్టి ప్రమాదం నుండి బయటపడ్డారు.
మృతుల్లో నెల్లూరు జిల్లాకు చెందిన ఒకే కుటుంబంలోని నలుగురు సజీవదహనం కావడం అందరినీ కలచివేస్తోంది. గోళ్లవారిపాలెంకు చెందిన గోళ్ల రమేష్ అనే వ్యక్తి తన భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి బెంగళూరులో స్థిరపడ్డారు. ఇటీవల, రమేష్ తన కుటుంబంతో హైదరాబాద్ వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ఘోర ప్రమాదం వారిని బలి తీసుకుంది. మొత్తం ఫ్యామిలీ మృత్యువాత పడటంతో వారి స్వగ్రామంలో తీవ్ర విషాదఛాయలు అలముకున్నాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ